జేసీ రప్పా.. రప్పా.. చంద్రబాబుపై ఇంట్రస్టింగ్ కామెంట్స్
మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్త ప్రదర్శించిన ‘రప్పా.. రప్పా’ పోస్టర్ తీవ్ర విమర్శల పాలైంది.
By: Tupaki Desk | 15 July 2025 11:18 PM ISTఏపీ రాజకీయాల్లో ‘రప్పా.. రప్పా..’ డైలాగ్ పాపులర్ గా మారింది. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్త ప్రదర్శించిన ‘రప్పా.. రప్పా’ పోస్టర్ తీవ్ర విమర్శల పాలైంది. అయితే జగన్ పర్యటన ముగిసి చాలా రోజులైనా ‘రప్పా.. రప్పా’ డైలాగ్ మాత్రం పొలిటికల్ ట్రెండింగులోనే కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ప్రతిరోజూ ‘రప్పా.. రప్పా’ అంటూ విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు. తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత జేసీ దివాకర్ రెడ్డి సైతం ‘రప్పా.. రప్పా’ అనడం ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్గింగుగా మారాయి.
మాస్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ‘రప్పా.. రప్పా’ వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడ్డారు. రెండు రోజుల క్రితం తాడిపత్రిలో పర్యటించిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్రలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ వర్గానికి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై తాజాగా స్పందించిన ‘‘నీ ఊరుకి నా ఊరు ఎంత దూరమూ.. నా ఊరికి నీ ఊరు కూడా అంతే దూరం. నువ్వు మా దగ్గరకు వచ్చి బెదిరిస్తే.. నీ దగ్గరకు వచ్చి మేం బెదిరించలేదమా? బెదిరించడం కాదు.. నీకు రప్పా.. రప్పా సినిమానే’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే జేసీ. తాము రాత్రిపూట కన్నుకొడితే పని జరిగిపోద్ది అంటూ హెచ్చరించారు.
అయితే వైసీపీ నేతల మాదిరిగా తాము బజారు భాష మాట్లాడబోమని జేసీ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల్లా తాము బండబూతులు తిడితే మా నేత అరుస్తాడు అంటూ సీఎం చంద్రబాబును పరోక్షంగా ప్రస్తావించారు జేసీ. నీలాంటి వాళ్లని ఎంతోమందిని చూశా.. నువ్వెంత బచ్చాగాడివి. నా గడ్డం, నా నెత్తి నెరిసిపోయింది. నువ్వు నన్ను అనేటోడివా? నీకు టికెట్లు ఇచ్చేందుకు మీ నాయకుడే వెనుకాడుతున్నాడు. నువ్వా నన్ను ఎక్కిరచ్చేది. మంచిగా పనిచేస్తే వ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఇట్నే ఉంటావు అంటూ బైరెడ్డికి హితవు పలికారు.
