Begin typing your search above and press return to search.

జగన్ బాగా కావలసిన మనిషి అంటున్న టీడీపీ పెద్దాయన !

ఇంతకీ టీడీపీలో ఉన్న పెద్దాయనకు జగన్ ఎందుకు కావాల్సిన మనిషి అయ్యారు ఏమా కధా అంటే చాలానే ఉంది మ్యాటర్.

By:  Tupaki Desk   |   31 May 2025 12:30 PM IST
జగన్ బాగా కావలసిన మనిషి అంటున్న టీడీపీ పెద్దాయన !
X

టీడీపీలో ఉన్న వారికి జగన్ కావాల్సిన వారుగా ఉండడం విచిత్రమే. గతకాలం రాజకీయాల్లో అయితే ఇది సరే అనుకోవచ్చు. ఉప్పు నిప్పులా ఉన్న వర్తమాన రాజకీయాల్లో చూస్తే కనుక కచ్చితంగా ఆశ్చర్యపడాల్సిందే. ఇంతకీ టీడీపీలో ఉన్న పెద్దాయనకు జగన్ ఎందుకు కావాల్సిన మనిషి అయ్యారు ఏమా కధా అంటే చాలానే ఉంది మ్యాటర్.

ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ బ్రదర్స్ లో ఒకరు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇక ఆయన రాజకీయం అంతా కాంగ్రెస్ లోనే సాగింది. అన్న జేసీ దివాకరరెడ్డితో కలసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండేవారు. కాంగ్రెస్ లో ఆయనకు అత్యంత సన్నిహిత నేత వైఎస్సార్.

అలా వైఎస్సార్ తో ఉన్న అనుబంధంతోనే జగన్ ఆయనకు కావాల్సిన మనిషి అయ్యారని అంటున్నారు. పైగా జగన్ తల్లి విజయమ్మ పుట్టినిల్లు తాడిపత్రి. అలా కూడా జగన్ ఆయనకు దగ్గర వారు. తాజాగా జేసీ ప్రభాకరరెడ్డి ఒక టీవీ చానల్ లో మాట్లాడుతూ జగన్ మీద చాలా కామెంట్స్ చేసారు. జగన్ వైఖరిని ఆయన నిశితంగా విమర్శించారు.

మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అందరి సంగతి తేలుస్తామని జగన్ అనడాన్ని పూర్తిగా తప్పుపట్టారు. కాలం మారింది. గతంలోలా జనాలు లేరు. అన్నీ వింటున్నారు, చూస్తున్నారు, వారికి అన్నీ తెలుసు అని జేసీ అన్నారు. జగన్ బెదిరించే ధోరణిని మానుకోకపోతే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు.

వైఎస్సార్ మాదిరిగా జగన్ వ్యవహరించాలని సూచించారు. వైఎస్సార్ అందరి పట్ల ప్రేమను కనబరచేవారు అని జేసీ అన్నారు. తాము ఎపుడు ఎదురుపడినా ఆప్యాయంగా పలకరించేవారు అని గుర్తు చేసుకున్నారు. ఆయన లక్షణాలు జగన్ కి రాలేదని విమర్శించారు.

జగన్ వైఖరి మారకపోతే ఆయన ఎప్పటికీ మళ్లీ సీఎం కాలేడని జోస్యం చెప్పారు. జగన్ తీరు మార్చుకుంటే కనుక ఏదో నాటికి అవకాశం ఉంటుందని ఇదే జేసీ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే జేసీ ప్రభాకరరెడ్డి టీడీపీలో ఉండి జగన్ ని కావాల్సిన మనిషివి కాబట్టే చెబుతున్నాను అనడం మీద చర్చ సాగుతోంది. ఆయన ఉన్నది టీడీపీ. తాజాగా టీడీపీ మహానాడులో జగన్ మరోసారి సీఎం అయ్యే చాన్స్ లేదని నాయకులు అంతా మాట్లాడుతూ కుండబద్ధలు కొట్టారు.

కానీ జగన్ తీరు మారితే చాన్స్ ఉందని జేసీ అంటున్నారు. ఏమిటో జేసీ తీరు ఇలా ఉంది అంతా అనుకుంటున్నారు. అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే జేసీ అదే నోటితో లోకేష్ ని కూడా బాగానే పొగిడారు. లోకేష్ లో పరిపక్వత బాగా వచ్చిందని ఆయన జనంతో మమేకం అవుతున్నారని అందువల్ల మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారు.

అంతే కాదు రాయలసీమలో మహానాడు అంటే ఎలా అని కొంత భయపడ్డానని కానీ వచ్చిన జనాన్ని చూసేసరికి మాత్రం తనకే ఆశ్చర్యం వేసింది అన్నారు. బడుగు బలహీన వర్గాల వారు వచ్చారని అంతా టీడీపీ కూటమి పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని దానికి నిదర్శనమే సునామీగా మహానాడుకు వచ్చిన జనాలు అని జేసీ అంటున్నారు. మొత్తానికి జేసీ అటు జగన్ ని ఇటు లోకేష్ ని ఏకకాలంలో తలచుకుని తన మార్క్ పాలిటిక్స్ ఇదే అని చెప్పేశారు.