Begin typing your search above and press return to search.

జేసీ 'శాంతి మంత్రం' : కేతిరెడ్డి సొంతగడ్డపైనే మాస్టర్ ప్లాన్?

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రూటు మార్చారు. ఎన్నడూ లేనట్లుగా ఆయన నోటి నుంచి శాంతివచనాలు వింటున్న జనం ఆశ్చర్యపోతున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2026 3:55 PM IST
జేసీ శాంతి మంత్రం : కేతిరెడ్డి సొంతగడ్డపైనే మాస్టర్ ప్లాన్?
X

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రూటు మార్చారు. ఎన్నడూ లేనట్లుగా ఆయన నోటి నుంచి శాంతివచనాలు వింటున్న జనం ఆశ్చర్యపోతున్నారు. నిత్యం మండే అగ్నిగుండంలా రగిలిపోతూ ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేసే మాజీ ఎమ్మెల్యే జేసీ ఇప్పుడు తప్పైపోయింది.. క్షమించండి అంటూ వింతగా మాట్లాడుతుండటం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోందని చెబుతున్నారు. శాంతిదూతలా కనిపిస్తున్న జేసీని చూసి ఇది కలా? నిజమా? అంటూ తాడిపత్రి జనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారని అంటున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రికి పక్కనే ఉండే ఎల్లనూరు మండలంలో పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షనుకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు ఫ్యాక్షన్ తో నాశనం అయిపోయారని, ఇకపై ఆలోచించాలని కోరారు.

ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల చాలా మంది ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు అలాంటివి వద్దంటూ జేసీ హితవు పలికారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఎల్లనూరు మండలంలో పర్యటించిన జేసీ, అక్కడి జనంలో ఆలోచనలు రేకెత్తించేలా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, భోగోతి నారాయణరెడ్డి స్వార్థం కోసం ప్రజలు బలవ్వాలా? అంటూ జేసీ ప్రశ్నించారు. ఇదే సమయంలో దమ్ముంటే కేతిరెడ్డి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేతిరెడ్డిని ‘తమ్ముడు’ అంటూ సంభోదించి అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు.

వాడివేడి రాజకీయాలకు జేసీ కేరాఫ్ గా చెబుతారు. రాయలసీమ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చున్నారు . నేను ఒకరి ఎదురెళ్లినా.. నాకు ఒకరు ఎదురొచ్చినా.. వారికే ఇబ్బంది అన్నట్లు జేసీ వైఖరి ఉంటుందని చెబుతుంటారు. తన మాటకు ఎదురు లేదన్నట్లుగా రాజకీయాలు చేసే జేసీ ఇప్పుడు ఆకస్మాత్తుగా శాంతికపోతాలు ఎగరేద్దాం అంటూ పిలుపునివ్వడం రాయలసీమ రాజకీయాలలో సరికొత్త చర్చకు తెరతీసినట్లైందని అంటున్నారు. గతంలో పులివెందులలో వాళ్లు (వైఎస్ ఫ్యామిలీ).. తాడిపత్రిలో మేము (జేసీ కుటుంబం) ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేవారమని ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా అంగీకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు సైతం ఫ్యాక్షన్ వదిలేశారని, ఎల్లనూరు ప్రజలకు అవసరమా? అంటూ ప్రశ్నించారు జేసీ.

టార్గెట్ కేతిరెడ్డి..

అయితే జేసీ వ్యాఖ్యలకు అర్థాలు వేరుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత మండలమైన ఎల్లనూరులో ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దంటూ ప్రచారం చేయడం వ్యూహాత్మకమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ దమ్ముంటే ఆయన బరిలోకి దిగాలని సవాల్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. తమ ప్రభుత్వంలో అమాయకులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారనే ఆలోచనతో జేసీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. తాను శాంతి కోరుకుంటున్నట్లు ప్రజల్లోకి సంకేతాలు పంపడం ద్వారా, వైసీపీ నేతలే ఉద్రిక్తతలు పెంచేలా ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేయడం జేసీ వ్యూహంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఎన్నడూలేనట్లు ఫైర్ బ్రాండ్ జేసీ నోటి వెంట శాంతివచనాలు రావడమే సర్వత్రా చర్చకు దారితీసిందని చెబుతున్నారు.