జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన లేఖ.. పోలీసులను ఇరుకున పెట్టిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన లేఖ రాశారు.
By: Tupaki Desk | 15 Sept 2025 5:00 PM ISTటీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన లేఖ రాశారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సీఎం స్థాయిలో భద్రత కల్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెద్దారెడ్డి భద్రత కోసం అయ్యే ఖర్చును సుప్రీంకోర్టు సూచనల ప్రకారం వసూలు చేశారా? లేదా అంటూ ఇరుకన పెట్టేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ పెద్దారెడ్డికి అంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏంటని జేసీ ఫైర్ అయ్యారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో జేసీ లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన లేఖపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఇంట్రస్టింగుగా మారింది.
తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి మధ్య నెలకొన్ని వివాదం తాజా లేఖతో మరో టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 16 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్ల కారణంగా జేసీతోపాటు ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు పట్టణ బహిష్కరణ విధించారు. అయితే ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బహిష్కరణ ఎత్తేశారు. కానీ, అప్పటివరకు తాడపత్రిలో హవా చాటిన పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఆయనపై పోటీ చేసిన అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎదురైంది.
తాడిపత్రిలో తన ఇంటికి రావాలని పెద్దారెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా, జేసీ వర్గం హెచ్చరికలతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అడ్డుకుంటూనే వచ్చారు. అయితే తనను తన సొంత ఇంటికి రాకుండా అడ్డుకోవడంపై న్యాయపోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్లి విజయం సాధించారు. తనకు పోలీసు భద్రత కల్పించాలని, అందుకు అవరమయ్యే ఖర్చును భరిస్తానని న్యాయస్థానంలో అంగీకరించారు. దీంతో ఆయనకు పోలీసు భద్రత కల్పించి, అవసరమైన డబ్బు వసూలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 6న పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చేందుకు పోలీసులు అనుమతించారు. సుప్రీం తీర్పు ప్రకారం సుమారు 650 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. అయితే ఆ మర్నాడే పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేశారు. 10వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున అంతవరకు భద్రత కల్పించలేమని, 10వ తేదీ తర్వాత తాడిపత్రి రావాలని నోటీసులిచ్చారు. దీనిప్రకారం కేతిరెడ్డి తాడిపత్రి వీడి వెళ్లిపోగా, రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయనను మళ్లీ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది.
ఈ పరిస్థితుల్లో జేసీ కొత్త దుమారానికి తెరలేపారు. సుప్రీం తీర్పు ప్రకారం డబ్బు చెల్లించకుండానే మాజీ ఎమ్మెల్యేకు బందబోస్తు వినియోగించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాదితో దరఖాస్తు చేయించిన జేసీ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పోలీసు భద్రత కోసం డబ్బు చెల్లిస్తానని సుప్రీంకోర్టుకు చెప్పిన జేసీ ఆ మాట తప్పారని జేసీ మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనివల్ల కేతిరెడ్డికి కోర్టు ద్వారా ఝలక్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
