"మా పరిస్థితి అధ్వానం.." జేసీ సంచలన కామెంట్స్
సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయంగా హీట్ పుట్టించే జేసీ.. ఈ సారి సొంత పార్టీనే టార్గెట్ చేశారు.
By: Tupaki Desk | 23 Jan 2026 5:44 PM ISTసీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయంగా హీట్ పుట్టించే జేసీ.. ఈ సారి సొంత పార్టీనే టార్గెట్ చేశారు. గతంలో తన రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై జేసీ వాగ్బాణాలు సంధించేవారు. ఆయన గురి పెట్టారంటే ఎంతటివారైనా విల్లవిల్లాడిపోవాల్సిందే అన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండటం లేదని, తమ మాటకు విలువ ఇవ్వడం లేదని జేసీ మదనపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే నేరుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో మంటలు పుట్టిస్తున్నాయి.
టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేశారు. తాడిపత్రిలో సైతం జేసీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్ బర్త్ డే స్పెషల్ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ప్రత్యేక అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో తన మాటకు తన కుమారుడు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాటకు విలువ ఇవ్వడం లేదని ఆక్రోసం వెల్లగక్కారు. ఎమ్మెల్యేగా ఉంటూ సొంత పనులు చేసుకోలేక పోతున్నామంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఇప్పుడు జేసీ మాట్లాడిన మాటలు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రభుత్వంపై జేసీ సంచలన కామెంట్స్ చేయడానికి కారణాలు కూడా ఆయన చెప్పారు. తనతోపాటు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గన్ లైసెన్సులను పోలీసులు రెన్యువల్ చేయడం లేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ గన్ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా తిప్పించడాన్ని తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని జేసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒక వేళ తన గన్ లైసెన్సు రెన్యువల్ చేయడానికి ఇబ్బంది ఉంటే, తన కుమారుడు, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గన్ లైసెన్సు అయినా రెన్యువల్ చేయాలి కదా? అంటూ జేసీ ప్రశ్నించారు.
‘‘నేను, నా కుమారుడు గన్ లైసెన్సు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం, నా విషయాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యే కైనా ఇవ్వొచ్చు కదా? ఈ విషయాన్ని హోంమినిస్టర్ కు చెబుతున్నా, చాలా సార్లు లెటర్లు రాశాను అయినా పనికాలేదు’’ అంటూ జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మాకు అవమానం. ఎవరైనా బాధపడొచ్చేమో, మాకు వ్యక్తిగతంగా కొన్ని బాధలు ఉన్నాయని అన్నారు. ‘‘అనితమ్మా నీది తప్పో.. పోలీసోళ్లది తప్పో నాకు తెలియదు. కానీ, ఇది ఎమ్మెల్యేకు జరిగిన అవమానం. సొంత గన్ లైసెన్సు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. మా పరిస్థితే ఇట్లా ఉంటే కార్యకర్తల సంగతేంటి?’’ అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించారు జేసీ.
అనంతపురం జిల్లాతోపాటు టీడీపీలో జేసీ కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వ్యక్తుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం గన్ లైసెన్సులను మంజూరు చేస్తుంటుంది. ఏటా ఆ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాల్సివుంటుంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గన్ లైసెన్సులను రెన్యువల్ చేయడం లేదని అంటున్నారు. దీనికి కారణం స్థానిక పోలీసు అధికారులతో జేసీకి ఉన్న విభేదాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. తాడిపత్రి ఏఎస్పీతోపాటు జిల్లా ఎస్పీతోనూ జేసీకి పొసగడం లేదు. వారి తీరుకు నిరసనగా ఆయన గతంలో బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి గన్ లైసెన్సు రెన్యువల్ విషయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
