సర్కారుకు మంట పెట్టి.. విధేయుడినంటే ఎలా.. జేసీ!
గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. కొడుకు అధికారాన్ని తండ్రి చెలాయిస్తున్నారన్న వాదన బలంగా ఉంది.
By: Tupaki Desk | 24 July 2025 6:00 AM ISTఎంత మాట పడితే అంత మాట.. నోటికి ఏది వస్తే..అది అనేసి.. సర్కారును అష్టదిగ్బంధంలో పెట్టేసి.. ఆనక నిండా ముసురుకు న్న తర్వాత.. నేను పార్టీకి విధేయుడిని.. సీఎం చంద్రబాబుకు భక్తుడిని అంటే సరిపోతుందా? ఇదే పద్ధతి.. ఇదీ.. ఇప్పుడు తాడి పత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులే చేస్తున్న విమర్శలు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబు విధేయుడినని.. ఆయన ఏం చెబితే అదే చేస్తానని అన్నారు. అంతేకాదు.. ఆయన కూర్చోమంటే కూర్చుం టా.. నిలబడమంటే నిలబడతానని చెప్పుకొచ్చారు. కానీ, గత నెల రోజులుగా జేసీ చేసిన యాగీ ముందు.. ఇవి బలాదూర్‌గా మారాయి.
గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. కొడుకు అధికారాన్ని తండ్రి చెలాయిస్తున్నారన్న వాదన బలంగా ఉంది. టీడీపీలోనూ ఈ విషయంపై చర్చగా మారింది. దీనికితోడు.. నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టి.. కక్ష పూరిత రాజకీయాలకు తెరదీశారు. వైసీపీ నాయకులపై కేసులు పెట్టించారు. `అసలు ఏమీ లేనప్పుడు ఎలా పెడతాం`` అన్నందుకు..ఏకంగా ఏఎస్పీపైనే `వాడు వీడు`.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇక, జిల్లా స్థాయి అధికారులపైనా.. రెవెన్యూ ఉద్యోగులపైనా ఏరా.. ఒరేయ్.. అంటూ విరుచుకుపడుతున్నారు.
ఇవన్నీ.. తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాటు.. స్థానికంగా కూడా అధికారుల మధ్య సెగ పెంచింది. జేసీ నోటి నుంచి ఎంత మాట పడితే అంత మాట పడాలా? అంటూ.. పోలీసులు ఉన్నతాధికారుల ముందు సహాయ నిరాకరణకు కూడా దిగారు. ఇక, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి.. సుదీర్ఘ సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో సర్కారుపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఆ వెంటనే జేసీ.. మీడియా ముందుకు వచ్చారు.
తాను చంద్రబాబుకు భక్తుడినని.. పార్టీ డెవలప్‌మెంటు కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు విజన్‌కు దాసుడినని చెప్పుకొచ్చారు. ఆయన ఏం చెప్పినా చేస్తానని వ్యాఖ్యానించారు. కానీ, అప్పటికే జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంది. అయితే.. ఇదే తొలిసారి అయితే..వేరేగా ఉండేది. గతంలో ఫ్లైయాష్ రవాణా విషయంలోనూ.. తీవ్ర దుమారం రేపారు. పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో జేసీపై చర్యలకు చంద్రబాబు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన కాళ్లబేరానికి రావడంపై పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
