జేసీ దివాకర్ రెడ్డి చింతతోటకు నిప్పు.. ఎవరు చేశారు?
మాజీ ఎంపీ.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన చింత తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
By: Garuda Media | 14 April 2026 11:43 AM ISTమాజీ ఎంపీ.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన చింత తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన చింత తోట ఉంది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు.. తోటలోని గడ్డికి నిప్పు పెట్టారు. అదే సమయంలో గాలుల తీవ్రతతో మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది స్పందించి..మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా.. చివరకు 30 ఎకరాల్లోని చింత తోట అగ్నికి ఆహుతైంది.
రాజకీయ కక్షలతోనే ఈ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉదంతంపై జేసీ దివాకర్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేతికి పంట వచ్చిన సమయంలోనే నిప్పు పెట్టటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఉదంతం కచ్ఛితంగా రాజకీయ కక్షలతోనే జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. తాడిపత్రి ప్రాంతంలోజేసీ కుటుంబానికి చెందిన ఆస్తులపై గతంలోనూ దాడులు జరగటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. 2020 డిసెంబరులో రాజకీయ విభేదాలతో జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడటం తెలిసిందే. సోషల్ మీడియా పోస్టుల వివాదంతో జరిగిన ఈ దాడి వేళ.. జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. అయితే.. ఈ దాడి కారణం ఫర్నీచర్.. వాహనాలు ధ్వంసం కావటం తెలిసిందే.
2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనూ తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.ఆ సమయంలోనూ జేసీ అనుచరుల ఇళ్లు.. ఆస్తులే లక్ష్యంగాదాడులు జరిగినట్లుగా గుర్తు చేసుకుంటున్నారు. తాజా ఉదంతంలోకి వెళితే.. ఈ ఉదంతం జరిగిన సమయంలో చీకటిగా ఉండటంతో తోటలోకి ఎవరు వచ్చారు? ఎవరు నిప్పు పెట్టారు? అన్నది గుర్తించలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఉదంతం ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఎవరో కావాలనే గడ్డికి నిప్పు పెట్టినట్లుగా వారు ఆరోపిస్తున్నారు
చేతికి వచ్చిన చింత దిగుబడితోపాటు.. లక్షలాది రూపాయిల విలువైన డ్రిప్ పైపులు కాలిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు రంగంలోకి దిగి.. వివరాల కోసం విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు.. వాహనాలు ఆ ప్రాంతంలో ఏమైనా తిరిగాయా? కోణంలో విచారణ చేస్తున్నారు. చింత తోటకు సమీపంలోని మొయిన్ రోడ్డు.. గ్రామ కూడళ్ల వద్ద ఉన్న సీసీ కెమేరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అర్థరాత్రి సమయంలో ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలు.. వ్యక్తుల వివరాల్ని గుర్తించేందుకు అధునిక టెక్నాలజీని వాడుతున్నట్లుగా తెలుస్తోంది. చీకట్లో ఈ ఉదంతం చోటు చేసుకోవటంతో.. దీనికి బాధ్యుల్ని గుర్తించే విషయంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని తాడిపత్రి రూరల్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. తోటలో పని చేసే సిబ్బందితోపాటు.. జూటూరు గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాల్ని సేకరిస్తున్నారు.
