Begin typing your search above and press return to search.

మోకాళ్ల నొప్పులకు పెన్షన్.. తుళ్లిపడిన ఎమ్మెల్యే - షాకింగ్ రియాక్షన్

ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి పెన్షన్ కోసం వెరైటీ రిక్సెస్ట్ వచ్చింది.

By:  Tupaki Political Desk   |   15 July 2026 8:36 PM IST
మోకాళ్ల నొప్పులకు పెన్షన్.. తుళ్లిపడిన ఎమ్మెల్యే - షాకింగ్ రియాక్షన్
X

ఏపీలో సామాజిక భద్రత పెన్షన్లకు చాలా డిమాండ్ ఉంది. దేశంలో ఎక్కడా లేనట్లు ఒక్కొక్కరికి రూ.4 వేలు పెన్షన్ ఇస్తుండటంతో ప్రజల్లో పెన్షన్ ఆశించేవారు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారా? అంటూ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి పెన్షన్ కోసం వెరైటీ రిక్సెస్ట్ వచ్చింది. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటుండగా, ఓ వ్యక్తి మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని పింఛన్ ఇప్పించాల్సిందిగా ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే చెప్పిన సమాధానం కూడా నెటిజన్లకు ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నియోజకవర్గ పర్యటనలో ఉన్న అస్మిత్ రెడ్డి తనకు ఎదురైన వారిని పలకరిస్తుండగా, ఓ వ్యక్తి మోకాళ్ల నొప్పులుగా ఉన్నాయని పెన్షన్ ఇప్పించాల్సిందిగా కోరాడు. దీంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక్కసారిగా అదిరి పడినట్లు కనిపించారు. ఇప్పటికే వృద్ధాప్య, వింతతు, వికలాంగ పెన్షన్లకు కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండగా, ఇలా మోకాళ్లు, మోచేతుల నొప్పులతో బాధపడిన వారికి పెన్షన్ ఎలా ఇవ్వగలము అనుకున్నాడో ఏమో.. పెన్షన్ అడిగిన వ్యక్తికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జవాబు చెప్పారు ఎమ్మెల్యే. మోకాళ్ల నొప్పులకు, నడుంనొప్పులకు పింఛన్ ఇవ్వరు, భలే ఉన్నావు నువ్వు అంటూ నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే. అంతేకాకుండా మోకాళ్ల నొప్పులు అందరికీ సర్వసాధారణంగా వస్తాయని, వయసులో ఎంతో చిన్నవాడినైన తనకు కూడా మోకాళ్ల నొప్పులు ఉన్నాయని చెబుతూ నవ్వించేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఏపీలో రూ.4 వేల పెన్షన్ కోసం జనం ఎంతలా ఎదురుచూస్తున్నారో కూడా వెల్లడైందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పెన్షన్లను రూ.4 వేలకు పెంచారు. రాష్ట్రం ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక లోటులో ఉండగా, నెలనెల రూ.4 వేల చొప్పున దాదాపు 68 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. కానీ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా జనం మాత్రం పెన్షన్లపై భారీగా ఆశలు పెంచుకుంటున్నారు.

ప్రస్తుతం పెన్షన్ల అర్హత వయసు 60 ఏళ్లు ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీగా 50 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పెన్షన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఎంపికను ఇంతవరకు చేపట్టలేదని చెబుతున్నారు. ప్రస్తుతం పింఛన్ ఉన్న భర్త చనిపోతే ఆ భార్యకు మాత్రమే వితంతు పింఛన్ ఇస్తున్నారు. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ తోపాటు కొత్తగా వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఒక్కరికీ ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. దీంతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త పింఛన్ దరఖాస్తుదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు