Begin typing your search above and press return to search.

హస్తినకు ప్రముఖ హీరోయిన్‌.. కమలం గూటికేనా!

ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి గోడలు దూకుతున్నారు. తాజాగా ఈ కోవలో ప్రముఖ సినీ నటి జయసుధ చేరిపోయారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 8:56 AM GMT
హస్తినకు ప్రముఖ హీరోయిన్‌.. కమలం గూటికేనా!
X

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో చేరికలు చురుగ్గా సాగుతున్నాయి. అయారాంలు గయారాంలు జంపింగ్‌ జపాంగులు చేస్తున్నారు. ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి గోడలు దూకుతున్నారు. తాజాగా ఈ కోవలో ప్రముఖ సినీ నటి జయసుధ చేరిపోయారు.

ఎన్నో చిత్రాల్లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌ గా నటించారు.. జయసుధ. అంతేకాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ చాలా బిజీగా గడిపారు. ఈ క్రమంలో 2009లో నాటి సీఎం వైఎస్సార్‌ ఆహ్వానంతో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుని సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన తలసాని శ్రీనివాస యాదవ్‌ ను జయసుధ ఓడించారు.

ఆ తర్వాత 2014లోనూ సికింద్రాబాద్‌ నుంచే బరి లోకి దిగిన జయసుధ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు పై ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జయసుధ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. కేవలం 18 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. ఇక 2018లో జయసుధ అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు.

వచ్చే ఎన్నికల్లో పోటీకి మాత్రం జయసుధ సిద్ధమవుతున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డితో జయసుధ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరతారని తెలుస్తోంది.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో బీజేపీ తెలంగాణ కీలక నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో వారందరి సమక్షంలో జయసుధ బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే జయసుధ ఢిల్లీకి చేరుకున్నారు.

కాగా వచ్చే ఎన్నికల్లో జయసుధ రెండు నియోజకవర్గాల పై దృష్టి సారించారని టాక్‌ నడుస్తోంది. హైదరాబాద్‌ నగరం పరిధి లో ఉన్న సికింద్రాబాద్‌ లేదా ముషీరాబాద్‌ నుంచి ఆమె పోటీ చేయొచ్చని చెబుతున్నారు. బీజేపీ కూడా సినీ నటుల కు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆమెకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

అయితే బీజేపీ లో జయసుధ చేరినంత మాత్రాన ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఆమె.. క్రిస్టియన్‌. బీజేపీ పూర్తిగా హిందువులపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యం లో ఆమె క్రిస్టియన్‌ కావడంతో అటు హిందువులు, తమకు గిట్టని బీజే పీలో చేరడంతో క్రిస్టియన్లు జయసుధకు ఓటేసే పరిస్థితి ఉండదనే చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో ఓడిపోయి జయసుధ మూడో స్థానం లో నిలవడం ఆమెకు అంత పట్టులేదని నిరూపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ గత ఎన్నికలు 2018లో ఆమె పోటీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ లో చేరడం వల్ల జయసుధ కు, ఆమె వల్ల బీజేపీకి వచ్చే ప్రయోజనం శూన్యమని టాక్‌ నడుస్తోంది.