Begin typing your search above and press return to search.

బీజేపీలోకి జయసుధ.. పోటీ చేసేది ఎక్కడి నుంచి?

సినీనటి.. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధను బీజేపీలో చేరేందుకు వీలుగా ఒప్పించారు. ఆమె మాత్రమే కాదు మరికొందరు కాంగ్రెస్ నేతల్ని బీజేపీలోకి వచ్చేందుకు వీలుగా మంతనాలు సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 July 2023 5:14 AM GMT
బీజేపీలోకి జయసుధ.. పోటీ చేసేది ఎక్కడి నుంచి?
X

మరో మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారు.. తాము పోటీ చేయాలనుకునే పార్టీల నుంచి టికెట్ల ప్రయత్నాలు చేస్తుంటే.. తమకు అవసరమైన అభ్యర్థుల కోసం పార్టీలు సైతం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వలసలు మొదలైన నేపథ్యంలో.. కమలం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా సినీనటి.. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధను బీజేపీలో చేరేందుకు వీలుగా ఒప్పించారు. ఆమె మాత్రమే కాదు మరికొందరు కాంగ్రెస్ నేతల్ని బీజేపీలోకి వచ్చేందుకు వీలుగా మంతనాలు సాగుతున్నాయి. గడిచిన కొన్ని వారాలుగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని.. కాంగ్రెస్ జోరు పెరిగిందన్న వాదన బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి దాని ప్రభావం తెలంగాణలోని కాంగ్రెస్- బీజేపీ మీద పడింది.

కాంగ్రెస్ లో ఉత్సాహం పొంగిపొర్లుతుంటే.. బీజేపీలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలతో పార్టీలో ఉత్సాహాన్ని పెంచాలన్న వ్యూహాన్ని బీజేపీ ఎంచుకుంది. ఇందులో భాగంగా పలువురు నేతల్ని ఢిల్లీకి పిలిచారు. కాంగ్రెస్ నుంచి నేతలు బీజేపీలోకి చేరాలన్న నిర్ణయం తీసుకున్నారంటే.. పార్టీ పరిస్ధితి బాగోలేదన్న సంకేతాలు ప్రజల్లో వెళ్లే అవకాశం ఉందని భావిస్తోంది కమలం పార్టీ.

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దివంగత నేత బాగారెడ్డి కుమారుడు జూపాల్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డిలు తాజాగాపార్టీలో చేరటం తెలిసిందే. జయసుధ విషయంలో గతంలోనూ చర్చలు జరిగినప్పటికి ఆమె నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజాగా జరిగిన ప్రయత్నాలతో ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.

ఆమె చేరిక వెనుక ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. ఆయన బీజేపీ తీర్థం తీసుకున్న తర్వాత నుంచి బీజేపీలోకి చేరికల ఊపు పెరగటం తెలిసిందే. ఆయన నుంచి వచ్చిన ప్రత్యేక హామీని నమ్మి కాషాయ కండువా కప్పుకోవటానికి పలువురు నేతలు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తనను నమ్ముకొని టీంగా ఉన్న వారిని వ్యూహాత్మకంగా బీజేపీలోకి తెచ్చే ప్రయత్నాల్ని ఆయన ముమ్మరం చేసినట్లుగా చెబుతున్నారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెర మీదకు వచ్చిన ఆమె.. విజయం సాధించటం తెలిసిందే. అయితే.. 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ టికెట్ ను సొంతం చేసుకున్నా.. ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. తాజాగా బీజేపీలో చేరుతున్న ఆమె.. సికింద్రాబాద్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆమె పోటీ చేసే నియోజకవర్గంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బండారు దత్రాత్రేయ, లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలు పోటీ చేసిన ముషీరాబాద్ నుంచి ఆమెను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఆమెకున్న సానుకూలతలు.. సామాజిక సమీకరణల్ని పరిగణలోకి తీసుకుంటే ముషీరాబాద్ కంటే సికింద్రాబాద్ సానుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్యమ నేతగా సుపరిచితమైన పద్మారావును ఎదుర్కొనే సత్తా జయసుధకు ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ఆమె ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో.. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ఆమెపై నెగిటివ్ ఉందని.. ఈ కారణంగా ముషీరాబాద్ నుంచి అయితే అలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. అదే సమయంలో.. ఈ సీటు కోసం దత్తన్న కుమార్తె ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు చెక్ పెట్టేందుకు జయసుధను తెర మీదకు తెచ్చేలా రాజ్యసభ సభ్యుడు.. ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయసుధ సీటు ఎక్కడి నుంచి అన్న సందిగ్థత నెలకొంది.