Begin typing your search above and press return to search.

ఓవర్ యాక్షన్ ఫలితమేనా ?

ఎంపీగా పోటీచేయమని జగన్ చెప్పినపుడు సరే అన్న మంత్రి తర్వాత అలిగారు. తనను పిలిచి మాట్లాడేందుకు జగన్ తరపున ఎంతమంది ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 7:58 AM GMT
ఓవర్ యాక్షన్ ఫలితమేనా ?
X

ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందో తాజాగా మంత్రి గుమ్మనూరు జయరామ్ విషయంలో బయటపడింది. మంత్రిని రాబోయే ఎన్నికల్లో ఆలూరు ఎంఎల్ఏగా కాకుండా కర్నూలు ఎంపీగా పోటీచేయమని చెప్పారు. మంత్రికూడా కర్నూలు పార్లమెంటు పరిధిలోని నేతలతో సమావేశాలు జరిపారు. ఆ తర్వాత తన మద్దతుదారులు చెప్పిందే చేస్తానని, జనాల ఎలాచెబితే అలా నడుకుంటానని ప్రకటించారు. దాంతో మంత్రి మాటల్లో తేడాకొడుతోందనే అనుమానాలు మొదలయ్యాయి.

ఎంపీగా పోటీచేయమని జగన్ చెప్పినపుడు సరే అన్న మంత్రి తర్వాత అలిగారు. తనను పిలిచి మాట్లాడేందుకు జగన్ తరపున ఎంతమంది ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఒకరోజు సడెన్ గా మీడియా సమావేశంపెట్టి తాను ఎంపీగా పోటీచేయాలంటే ఆలూరులో తనకొడుక్కి ఎంఎల్ఏ టికెట్ ఇవ్వాల్సిందే అని కండీషన్ పెట్టారు. తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలని కీలక నేతలు కబురుచేసినా మంత్రి పట్టించుకోలేదు. పైగా కాంగ్రెస్ తరపున పోటీచేయటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. దాంతో మంత్రి వ్యవహారశైలిపై జగన్ కు మండింది.

అందుకనే మంత్రికి చెప్పకుండానే కర్నూలు ఎంపీగా జయరామ్ స్ధానంలో బీవై రామయ్యను ప్రకటించేశారు. బీవై ఇపుడు కర్నూలు ఎంపీగా ఉన్నారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీల(చేనేతల)తో పాటు వాల్మీకి సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే రామయ్యను జగన్ ఎంపికచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉండి కూడా జగన్ వైఖరి ఏమిటో పసిగట్టలేకపోయారు. బెదిరిస్తే జగన్ బెదిరేరకం కాదన్న విషయాన్ని మంత్రి మరచిపోయారు.

వైసీపీలో కంటిన్యు అవ్వాలంటే జగన్ చెప్పినట్లు వినాలి. లేకపోతే జగన్ను కన్వీన్స్ చేసుకోవాలి. అంతేకానీ జగన్ను ధిక్కరించి వైసీపీలో తాను అనుకున్నట్లుగా ఉంటానంటే కుదరదన్న విషయాన్ని జయరామ్ మరచిపోయారు. జగన్ మైనస్సు అదే ప్లస్సు అదే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగా మంత్రికి ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశం పోయింది అలాగని ఎంఎల్ఏగా అవకాశమూ లేదు. ఇపుడు జయరామ్ ముందున్న మార్గం ఏమిటంటే జగన్ చెప్పినట్లు వినటం లేకపోతే పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోవటమే. మరి ఏమి జరుగుతుందో చూడాలి.