Begin typing your search above and press return to search.

జయప్రకాష్ నారాయణ్ కి రాజ్యసభ డీల్...!?

సరే జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా ప్రభావం ఎంత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కూటమికి దక్కేదేమిటి అన్నది వేరే విషయం.

By:  Tupaki Desk   |   21 March 2024 9:40 AM GMT
జయప్రకాష్ నారాయణ్ కి రాజ్యసభ డీల్...!?
X

మేధావిగా బ్యూరోక్రాట్ గా ఉంటూ పొలిటీషియన్ గా మారి ఒక సారి మాత్రమే చట్ట సభలో అడుగుపెట్టిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు. దానికి ఆయన చెప్పిన మాటలు అభివృద్ధి కోసం ఏపీ బాగు కోసం అని. తన మీద కుల ముద్ర వేసుకున్న అభ్యంతరం లేదని తన ఓటు కూటమికే అని ఆయన ఓపెన్ గా చెప్పేశారు.

సరే జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా ప్రభావం ఎంత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కూటమికి దక్కేదేమిటి అన్నది వేరే విషయం. కానీ ఒక మేధావిగా ఆయన చెప్పిన మాటలు ఇచ్చిన మద్దతు అయితే కూటమికి కొంత నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే జయప్రకాష్ నారాయణ్ ఏపీలో టీడీపీ కూటమికి జై కొట్టడం వెనక చర్చ సాగుతోంది. ఇక జయ ప్రకాష్ నారాయణ ఎవరికైనా ఏదైనా సపొర్ట్ చేశారు అంటే అందులో ఏదో లాభం ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు. ఆయన ఏ లాభం లేకుండా చేయడని కూడా టాక్ ఉందని అంటారు.

ఇపుడు ఆయన సడెన్ గా కూటమికి మద్దతు ఇవ్వడం వెనక కూడా చాలా విషయాలే ఉన్నాయని అంటున్నారు. ఇక జయప్రకాష్ తీరు చూసినా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసినా కేవలం వైసీపీ పాలనలో లోపాలు ఉన్నట్లుగా విమర్శించారు. మరి ఆయన న్యూట్రల్ పర్సన్ గా మేధావిగా ఉంటూ కేవలం ఏపీ బాగు కోరుకున్న వారు అయితే టీడీపీ అయిదేళ్ల పాలనలో లోపాలు గురించి ఎందుకు చెప్పడంలేదు అని అంటున్నారు.

ఇక జయప్రకాష్ నారాయణ్ మద్దతులోని డొల్లతనాన్ని కూడా ఎండగడుతున్న వారు ఉన్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ కూడా ఉంది. ఆ పార్టీ పదేళ్ల పాలనలో కేంద్రం నుంచి ఏపీకి ఏమి ఇచ్చింది అన్నది కూడా చూడాలి కదా. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం అని చెప్పిన అపర మేధావి జయప్రకాష్ నారాయణ్ కి ఇపుడు బీజేపీ ఏమీ ఇవ్వకపోయినా నచ్చినట్లేనా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తోంది బీజేపీ.మరి దాని మీద కూడా జేపీ ఏమీ మాట్లాడడం లేదు. విభజన హామీలను తుంగలోకి తొక్కినా పోలవరం విషయం అలా అయిపోయినా జేపీకి ఈ కూటమిలో బీజేపీ ఉండడం అభివృద్ధికి దర్పణంగా కనిపిస్తోందా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

ఏపీకి బీజేపీ ఏమి చేసిందో చెప్పి అపుడు జేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఉమ్మడి ఏపీ విడిపోయిన తరువాత విభజన జరిగిన పదేళ్ల కాలంలో బీజేపీ ఏపీకి ఘోరమైన అన్యాయం చేసింది కదా మరి ఆ విషయం ప్రస్తావించకపోవడం బీజేపీని నిలదీయకపోవడం పక్కన పెడితే కూటమిని మించినది లేదు, కూటమితోనే అభివృద్ధి అని జేపీ ఎలా చెప్పగలుతున్నారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

జేపీ మాటలు చూస్తే కేవలం అయిదేళ్ల వైసీపీ పాలనలోనే లోపాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో అప్పులు ఉన్నాయని ఆయన ఇపుడే కనుగొన్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో పరిశ్రమలు లేవని ఉపాధి లేవని అంటున్నారు. గత అయిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో కూడా చెబితే బాగుంటుందని అంటున్నారు.

అక్కడికి కూటమి ఏపీకి ఏదో చేస్తుందని విరగదీస్తుందని జేపీ చెప్పడం పట్ల ఏకపక్షమే ఉందని అంటున్నారు అంతే కాదు పాలనా సంస్కరణలు అంటూ చెబుతూ వచ్చిన జేపీ వైసీపీ ఏలుబడిలో సచివాలయ వ్యవస్థ కానీ గ్రామాల అభివృద్ధి కానీ మెచ్చుకుంటే ఇలా చెప్పి ఉండేవారు కాదు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల వేళ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు తీసుకోవడానికి జేపీ ఈ మద్దతు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి మేధావులు అని చెప్పుకుంటున్న వారు ఈ విధంగా వన్ సైడెడ్ గా వ్యవహరించడం పైగా కుల ముద్ర వేయవద్దు అని అనడం చూస్తే రాజకీయాల్లో ఎటు పోతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు అంటున్నారు.

జేపీ లోక్ సత్తా ఉద్యమ నేతగా ఉన్నపుడు అంతా ఆయన పట్ల గౌరవ భావంతో ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చి ఆయన తన కులం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని పోటీ చేయడం నుంచే ఆయన కూడా రొటీన్ పాలిటిక్స్ చేస్తారు అని నాడే విమర్శలు వచ్చాయి. ఇపుడు ఆయన పెద్ద మనిషి మేధావిగా చెబుతూ కూటమి బెస్ట్ అనడం పట్ల ఒక సెక్షన్ అన్నిటి కన్నా పేదలు ఎక్కువగా వ్యతిరేకించే అవకాశం ఉందని అంటున్నారు.