జయమంగళ డబుల్ గేమ్ ఆడుతున్నారా ..!
అయితే.. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జయమంగళ.. తిరిగి టీడీపీ గూటికి వచ్చారు.
By: Garuda Media | 17 Feb 2026 12:00 AM ISTజయమంగళ వెంకటరమణ... వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేత. నిజానికి ఆయన పొలిటికల్ ప్రస్థానం.. టీడీపీతోనే ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో విజయం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల అనంతరం.. వైసీపీలో చేరిన ఆయనకు జగన్.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో తనకు, పార్టీకి కూడా ఆయన ఉపయోగపడతారని భావించారు. ఇక, 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించినా.. ఫలితం దక్కలేదు.
అయితే.. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జయమంగళ.. తిరిగి టీడీపీ గూటికి వచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ.. ఆయన చేసిన రాజీనామాను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు. దీనిపై ప్రస్తుతం న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇటీవల చైర్మన్ పేషీకి కూడా హాజరై.. తన వివరణ ఇచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇలా.. జరుగుతున్న పరిణామాల్లో జయమంగళ అనూహ్య రాజకీయాలకు తెరదీశారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు.. ఇటీవల కాలంలో చాలా మంది ఉన్నారు. కానీ, వారు ఎక్కడా వైసీపీ అధినేత జగన్‌ను కొనియాడడం కానీ.. ఆయనపేరును తలుచుకోవడం కానీ చేయడం లేదు. జయమంగళ కంటే జగన్‌కు ఎంతో ఇష్టులైన మోపిదేవి వెంకటరమణ కూడా.. తన రాజ్యసభ సీటును వదులుకుని వచ్చేశారు. ఆయన కూడా ఎప్పుడూ.. జగన్‌ను పొగిడింది లేదు. పైగా విమర్శలు కూడా సంధించారు. అలాంటిది.. జయ మంగళ మాత్రం జగన్ విషయంలో స్పందించిన తీరు కూటమి నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రస్తుతం జరుగుతున్న మండలి సమావేశాలకు హాజరైన జయమంగళ.. మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. `జగనే నా దేవుడు. నిత్యం ఆయన ఫొటోకు దణ్ణం పెట్టుకునే బయటకు వస్తాను. ఆయన నా జీవితంలో ఒక మంచి మలుపు. ఆయన నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారు` అంటూ.. వ్యాఖ్యానించారు. ఇవేవీ చాటుమాటున కూడా కాదు. మీడియాతోనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్న కూటమి నాయకులు.. ముఖ్యంగా టీడీపీ నేతలుఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంతేకాదు, వైసీపీని కాదని బయటకు వచ్చిన జయమంగళ ఇలా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబ ట్టారు. ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారా? అనే సందేహాన్ని కూడా వ్యక్తం కూడా చేశారు. మరి జయమంగళ ఎందుకలా మాట్లాడారో తెలియదు కానీ.. ఇవే వ్యాఖ్యలు కొనసాగిస్తే.. టీడీపీలో ఆయన ఒంటరయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
