Begin typing your search above and press return to search.

ఆస్తి పన్ను బకాయితో ‘అమ్మ’ ఇల్లు సీజ్

కాలమహిమ అంటే ఇలానే ఉంటుంది. ఏళ్లకు ఏళ్లుగా ఒక రాష్ట్రాన్ని తిరుగులేని అధికారంతో నడిపిన ‘అమ్మ’కు చెందిన భవనం తాజాగా పన్ను బకాయితో సీజ్ అయ్యే దుస్థితి.

By:  Garuda Media   |   31 March 2026 12:18 PM IST
ఆస్తి పన్ను బకాయితో ‘అమ్మ’ ఇల్లు సీజ్
X

కాలమహిమ అంటే ఇలానే ఉంటుంది. ఏళ్లకు ఏళ్లుగా ఒక రాష్ట్రాన్ని తిరుగులేని అధికారంతో నడిపిన ‘అమ్మ’కు చెందిన భవనం తాజాగా పన్ను బకాయితో సీజ్ అయ్యే దుస్థితి. తమిళనాడులో తిరుగులేని రాజకీయ అధినేతల్లో ఒకరిగా నిలిచిన అమ్మ అలియాస్ జయలలితకు చెందిన ఒక భవనం హైదరాబాద్ లో ఉంది. తాజాగా ఆ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఏళ్లకు ఏళ్లుగా ఆస్తిపన్ను బకాయిలు ఉన్న నేపథ్యంలో ఆ భవనాన్ని సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉండే యూసఫ్ గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ 38 పరిధిలో ఉంటుంది శ్రీనగర్ కాలనీ.

జీ ప్లస్ 4తో నిర్మించిన ఈ భవనం తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద ఉంది. ఈ ఆస్తికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు 2017 నుంచి పేరుకు పోయాయి. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేదు. గతంలో ఈ భవనంలో ఒక ప్రైవేటు ఆఫీసును నిర్వహించారు. దీంతో.. దీన్ని కమర్షియల్ బిల్డింగ్ కింద ఆస్తిపన్ను విధించారు. అయితే.. 2017 నుంచి ఈ భవనాన్ని కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్ కిందకు మార్చుకున్నామని.. అందుకే.. పన్ను తీరును మార్చాలని కోరుతూ జయలలిత మేనల్లుడు.. చెన్నైకు చెందిన దీపక్ జయకుమార్ జీహెచ్ఎంసీ అధికారుల్ని కోరారు.

అయితే.. అధికారులు అడిగిన వివరాలు.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్పగించటం జరగలేదన్నది సమాచారం. ఇదిలా ఉండగా ఏళ్లకు ఏళ్లుగా ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. బకాయిలకు సంబంధించి మార్చి 31 వరకు అమల్లో ఉన్న ఓటీఎస్ స్కీం నేపథ్యంలో రాయితీ పోను రూ.82.91 లక్షల మేర బకాయి ఉంది. ఈ బకాయి చెల్లింపులు చేయని నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు అధికారానికి చిరునామాగా ఉన్న వ్యక్తికి చెందిన ఆస్తి.. కాలప్రవాహంలో చివరకు ఆస్తిపన్ను కట్టక.. బకాయిలతో సీజ్ కావటం గమనార్హం.