జవాన్ పై నోరు పారేసుకున్న బ్యాంక్ ఎంప్లాయ్.. నెటిజన్లు ఏం చేశారంటే..?
ఒక జవాను తన లావాదేవీల గురించి బ్యాంకు ఉద్యోగికి ఫోన్ చేశాడు. బ్యాంక్ మహిళా ఉద్యోగి మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
By: Tupaki Desk | 20 Sept 2025 2:00 AM ISTదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఇద్దరికి ముఖ్యంగా గౌరవించాలి. అందులో ఒకరు జవాన్.. రెండు కిసాన్.. ఇది భారత్ లో ఒక నినాదం.. లాల్ బహదూర్ శాస్త్రి జాతికి ఇచ్చారు. మొదట సరిహద్దులు భద్రంగా ఉంటేనే దేశంలోని ప్రతి పౌరుడు సంతోషంగా ఉంటాడు. ఎండ, మంచు, నీరు, ఎడారి ఇలా దేనికి జంకకుండా జవాన్లు దేశాన్ని రక్షించేందుకు కాపలా కాస్తుంటారు. ఇక దేశంలో ఉన్న కిసాన్ పౌరులకు తిండి పెడతారు. అందుకే ఇద్దరు అందరి కంటే ఎక్కువ గౌరవింపబడే వ్యక్తులు.
గౌరవించే వారినే అవమానించడం..
అన్ని విధాలుగా దేశం సుభిక్షంగా ఉండాలంటే సరిహద్దుల్లో జవాన్లు ఉండాల్సిందే. వారికి గౌరవించడం మన ప్రథమ విధి. వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలి. తీవ్రమైన మంచులో కాపలా కాస్తున్న సమయంలో ఒక్కో సమయంలో సైనికుడి ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ విషయం తెలిసి కూడా వారు కాపలా కాస్తున్నారంటే వారి పాదాలకు ప్రణవిల్లాల్సిందే. అలాంటి జవన్ ను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ధూషించడం సిగ్గు చేటు. ఈ విషయాన్ని నెటిజన్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నువ్వు దేశంలో ఉద్యోగం చేసుకుంటూ భర్త, పిల్లలతో ఆనందంగా ఉన్నావంటే సరిహద్దుల్లో వారే కారణం అంటూ తిట్ల దండకం మొదలు పెట్టారు.
లావాదేవీల గురించి ఫోన్ చేస్తే దుర్భాషలు..
ఒక జవాను తన లావాదేవీల గురించి బ్యాంకు ఉద్యోగికి ఫోన్ చేశాడు. బ్యాంక్ మహిళా ఉద్యోగి మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆ జవాను తన ఖాతా సమస్యను వివరించగా, ఆమె నిర్లక్ష్యంగా స్పందిస్తూ ‘మీరు చదువుకుంటే, మంచి కంపెనీలో పనిచేసేవారు, కానీ మిమ్మల్ని సరిహద్దుకు పంపారు. అందుకే మీ పిల్లలు వికలాంగులుగా పుట్టి, మీలాంటి వారు చివరికి అమరవీరులు అవుతున్నారు. నేను కూడా రక్షణ కుటుంబానికి చెందినదాననే, కాబట్టి మీరు నాకు ఏమి నేర్పుతారు? మీరు నిజంగా పెద్ద కుటుంబానికి చెందినవారైతే, మీరు రూ. 15–16 లక్షల రుణాలు తీసుకునేవారు కాదు. ఉపన్యాసాలు ఇవ్వకండి. మీరు అప్పుల మీద జీవిస్తూ నాకు సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు 5000 కూడా తిరిగి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అది పెద్ద విషయంలా మాట్లాడుతున్నారు. నా ముందు ప్రదర్శించకండి. మీకు కావలసినది చేయండి, నేను మీ సేవకుడినా? నాకు ఒక సవాలు ఇచ్చారు, సరియైనదా? ఇప్పుడు మీరు చేయగలిగితే నాకు చూపించండి’ అంటూ వ్యాఖ్యానించడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
విరుచుకుపడిన నెటిజన్లు
సైనికుడు సరిహద్దులో త్యాగం చేస్తేనే మనం ఇక్కడ సురక్షితంగా జీవిస్తున్నామన్న వాస్తవం గుర్తు చేసుకుంటూ, ఆ ఉద్యోగినిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘జవాన్ల త్యాగం వల్లే నీకు ఈ ఉద్యోగం దక్కింది. దేశానికి ప్రాణాలు అర్పించే వారిని అవమానించడం మానవత్వానికి విరుద్ధం’ అని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, బ్యాంక్ ఉద్యోగినిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. దేశ భద్రతకోసం ప్రాణాలను పణంగా పెడుతున్న జవాన్ల గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. జవాను సేవ త్యాగానికి ప్రతీక. అలాంటి వారిని అవమానించడం కేవలం వ్యక్తిగత తప్పిదం మాత్రమే కాదు, దేశాన్నే అవమానించడమేనని సమాజం గట్టిగా చెబుతోంది.
ఆమె మా బ్యాంక్ ఎంప్లాయ్ కాదు..
అయితే ఆమె ఒక పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ ఎంప్లాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండడంతో స్పందించిన సదరు బ్యాంక్ తను మా బ్యాంక్ ఎంప్లాయ్ కాదు అంటూ వివరణ ఇచ్చుకుంది. ఏది ఏమైనా జవాన్లతో ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని దేశం వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
