Begin typing your search above and press return to search.

400 మంది ప్రయాణికులున్న రెండు విమానాలు ఢీ... వీడియో వైరల్!

అవును... జపాన్‌ రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్‌ వేపై దిగుతుండగా జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన జేఏల్‌ 516 విమానం మంటల్లో చిక్కుకుంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 12:01 PM GMT
400 మంది ప్రయాణికులున్న రెండు  విమానాలు ఢీ... వీడియో వైరల్!
X

రోడ్డుమీద రెండు బైకులు ఢీకొన్నట్లు, రెండు కార్లు ఢీకొంటే ఎదురయ్యే ఇబ్బందుల సంగతి తెలిసిందే. ఇక ఒకే ట్రాక్ పై రెండు ట్రైన్స్ ఢీకొంటే జరిగే భారీ నష్టం సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానశ్రయంలో రెండు విమానాలు ఢీకొంటే ఎలాంటి పెను ప్రమాదం జరుగుతుందనే విషయంలో ఎవరి ఊహలను వారికి వదిలేయవచ్చు. ఈ క్రమంలో తాజాగా టోక్యో ఎయిర్‌ పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి.. ఈ సందర్భంగా నెట్టింట దర్శనమిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అవును... జపాన్‌ రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయం రన్‌ వేపై దిగుతుండగా జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన జేఏల్‌ 516 విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ సందర్భంగా ఏర్పడిన మంటలు భయానకవాతావరణాన్ని సృష్టించాయి. ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 400 మంది వరకు ఉన్నారని జపాన్‌ టైంస్ వెల్లడించింది.

ఈ క్రమంలో ఈ ఘటనపై స్పందించిన జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధికారులు విమానం రన్‌ వేపై దిగిన తర్వాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌ క్రాఫ్ట్‌ ను ఢీకొన్నట్లు భావిస్తున్నామని తెలియజేశారు. ప్రమాద సమయంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో ఒకరు మాత్రమే బయటపడగా.. మిగిలిన ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదని ఎన్‌.హెచ్‌.కే వెల్లడించింది. ఈ తాజా ఘటనతో హనేడా విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

దీంతో ఈ ఘటనపై జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 70కి పైగా అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయని వెల్లడించారు.

కాగా... ఇప్పటికే భారీ భూకంపాలతో జపాన్ వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఆ వరుస భూకంపాలవల్ల సంభవించిన నష్టాన్ని ఇంకా అంచనా వేయకముందే.. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ భారీ ప్రమాదం చోటు చేసుకోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తుంది!