Begin typing your search above and press return to search.

భూకంపం వేళ అంతరిక్షంలో శాటిలైట్లకు ఏమవుతోంది?

భూకంపం ధాటికి భూకంప కేంద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరాన ఉండే భవనాలు.. నిర్మాణాలు పేకమేడల్లా కదిలిపోవటం తెలిసిందే. కానీ.. ఆకాశంలో ఉన్న శాటిలైట్ల మీద కూడా భూకంపాల తీవ్రతకు గురవుతున్న విషయం తాజా పరిశోధనలో గుర్తించారు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 3:00 PM IST
భూకంపం వేళ అంతరిక్షంలో శాటిలైట్లకు ఏమవుతోంది?
X

భూమిపై ఒక ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంటే సదూర తీరాన.. భూమితో ఏ మాత్రం సంబంధం లేని అంతరిక్షంలోని శాటిలైట్లకు ఎఫెక్టు ఉంటుందా? అంటే.. అవునని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు అంచనా లేని సరికొత్త విషయాల్ని వెల్లడిస్తూ సర్ ప్రైజ్ కు గురి చేస్తున్నారు. భూకంపం ధాటికి సదూరన ఉన్న శాటిలైట్లు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయన్న కొత్త విషయం వెలుగు చూసింది.

భూకంపం ధాటికి భూకంప కేంద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరాన ఉండే భవనాలు.. నిర్మాణాలు పేకమేడల్లా కదిలిపోవటం తెలిసిందే. కానీ.. ఆకాశంలో ఉన్న శాటిలైట్ల మీద కూడా భూకంపాల తీవ్రతకు గురవుతున్న విషయం తాజా పరిశోధనలో గుర్తించారు. భౌతికంగా భూమితో అనుసంధానం కాని శాటిలైట్లకు భూకంప పర్యవసనాలకు మధ్య ఉన్న లింకుపై తొలిసారి పరిశోధనలు చేపట్టారు. జపాన్ లోని నగోయా విశ్వవిద్యాలయంలోని సైంటిస్టుల టీం చేసిన ఈ రీసెర్చ్ వివరాల్ని ఎర్త్.. ప్లానెట్స్.. స్పేస్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.

తమకున్న సందేహాల్ని తీర్చుకోవటానికి వీలుగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలోని 4500లకు పైగా రిసీవర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకొని ఆ డేటాను విశ్లేషించారు. రెండు భూఫలకాల కొనల వద్ద రాపిడి.. ఆ రెండు ఢీ కొనే సందర్భాల్లో భూకంపం వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భూతల వనరులు మాత్రమే ప్రభావితం అవుతాయన్న భావనకు భిన్నంగా అంతరిక్షంలోనూ ప్రభావం ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా చేసిన పరిశోధనల్లో వెల్లడైన ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే.. 2024 జనవరి ఒకటిన జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్ఛర్ లోని నోటో ద్వీపకల్పంలో రిక్టార్ స్కేల్ మీద 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఆకాశంలోని సంక్లిష్టమైన ధ్వని తరంగాలు దూసుకెళ్లాయి. ఇవి భూమి నుంచి ఆకాశంలో 60 నుంచి వెయ్యి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. అక్కడి ఎలక్ట్రాన్లతో నిండిన వాయువులను ఈ ధ్వని తరంగాలు విపరీతంగా ప్రేరేపించాయి. ఈ వాయువులు కింది పొర అయిన థర్మోస్ఫియర్ వాతావరణంలోకి కొంత శక్తిని విడుదలచేసినట్లుగా గుర్తించారు.

ఈ కారణంగా థర్మోస్పియర్ ఆవరణలో స్థిరంగా ఉన్న శాటిలైట్లపై ఈ అదనపు శక్తి ప్రతికూల ప్రభావాన్ని చూపటం.. దీంతో అక్కడి శాటిలైట్ల నుంచి భూమి మీదకు జరగాల్సిన కమ్యూనికేషన్ సిగ్నళ్ల ప్రసరణ వేగంలో మార్పుల్ని గుర్తించారు. సిగ్నళ్లు ఆలస్యంగా రావటంతో పాటు.. సిగ్నళ్ల సాంద్రత సైతం తగ్గిన విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. భూకంపం చోటు చేసుకున్నప్పుడు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ధ్వని తరంగాలు ఐనో ఆవరణను చేరుతున్న విషయాన్ని గుర్తించారు.

దీన్ని శాస్త్రవేత్తలు ఎలా వర్ణిస్తున్నారంటే.. నిశ్చలంగా ఉండే కొలనులో రాయి విసిరితే ఎలా అయితే వలయాకార అలలు ఏర్పడతాయో.. అలానే ధ్వని తరంగాలు ఐనోస్ఫియర్ లోకి వెళుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం భూకంపం చోటు చేసుకున్నప్పుడు భూఫలకాలు ఢీ కొన్న ఒక ప్రాంతంలోనే ధ్వని తరంగాలు ఉద్భవిస్తాయన్న భావన ఉండేది.

అయితే.. అందుకు భిన్నంగా జపాన్ లోని నోటో ద్వీపకల్పభూకంప ఘటనలో 150 కిలోమీటర్ల పొడవునా రెండు భూఫలకాలు ఢీ కొన్న చోట్ల నుంచి ధ్వనితరంగాలు పుట్టుకొచ్చాయని గుర్తించారు. దీని కారణంగా శాటిలైట్ల నుంచి ప్రసారాల నాణ్యత తగ్గినట్లుగా గుర్తించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలోనూ ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. దీంతో.. భూకంపాల కారణంగా భూమి మీద ప్రభావితం ప్రాంతంలోనే కాదు.. అంతరిక్షంలోని శాటిలైట్ల పని తీరూ దెబ్బతింటున్న విషయాన్ని గుర్తించారు. దీనిపై మరింత అవగాహనకు ప్రయత్నిస్తున్నారు.