Begin typing your search above and press return to search.

వినూత్న ఆలోచన.. జననాల రేటు పెంచేందుకు ఉద్యోగులకు 36 గంటల సెలవు

దీని ద్వారా ప్రజలకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుందని, తద్వారా జంటలకు వ్యక్తిగత సమయం దొరుకుతుందని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది.

By:  Tupaki Desk   |   3 April 2025 4:00 AM IST
వినూత్న ఆలోచన.. జననాల రేటు పెంచేందుకు ఉద్యోగులకు 36 గంటల సెలవు
X

తగ్గిపోతున్న జనాభా కారణంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్న జపాన్ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశంలో జననాల రేటును పెంచే లక్ష్యంతో ఉద్యోగులకు వారానికి 36 గంటల ప్రత్యేక సెలవును ప్రకటించింది. పిల్లలను కనడానికి ఉద్యోగులకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జపాన్‌లో జననాల రేటు తగ్గడానికి కేవలం సమయం కొరతే కాకుండా, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక మార్పులు, మారుతున్న జీవన ప్రాధాన్యతలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం, పిల్లల సంరక్షణకు తగిన సమయం కరువవడం, అధిక పని గంటలు వంటి కారణాల వల్ల చాలా మంది యువత తల్లిదండ్రులు అయ్యేందుకు వెనుకాడుతున్నారు.

ఈ సమస్యను అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుందని, తద్వారా జంటలకు వ్యక్తిగత సమయం దొరుకుతుందని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అదనపు సమయం వారి వ్యక్తిగత జీవితానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి, కుటుంబంతో గడపడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వ ఉద్దేశం. ఇది జననాల రేటు పెరగడానికి దోహదం చేస్తుందని ఆశిస్తుంది.

దశాబ్దాలుగా క్షీణిస్తున్న జనాభాతో జపాన్ పోరాడుతోంది. ఇప్పటికే దాదాపు తొమ్మిది మిలియన్ ఇళ్లు జనాభా లేక ఖాళీగా ఉన్నాయి. జననాల రేటును పెంచడానికి ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే టోక్యో నగరంలో వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టారు. మిగిలిన రోజుల్లో ప్రజలు పిల్లలను కనడంపై దృష్టి పెడతారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరో వైపు వృద్ధాప్య జనాభా జపాన్‌కు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారింది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో జపాన్ ఒకటి. కార్మిక శక్తి వేగంగా తగ్గిపోతున్నందున ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది. గతంలో తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలతో కూడిన పిల్లల సంరక్షణ సౌకర్యాలు, వివాహం చేసుకుంటే బహుమతులు వంటి విధానాలను ప్రవేశపెట్టినప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

దీంతో ప్రభుత్వం పని సంస్కృతిలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని భావిస్తోంది. కుటుంబం, బంధాలు, ముఖ్యంగా పిల్లలను కనడంపై ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆశిస్తోంది. జనాభా క్షీణతను నివారించడానికి, జననాల రేటును పెంచడానికి జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రత్యేకమైన నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.