80 ఏళ్ల తర్వాత జపాన్ సంచలన నిర్ణయం.. యుద్ధ విమానాల అమ్మకానికి రెడీ
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 ఏళ్లు. అవును.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తనకు తానుగా విధించుకున్న స్వీయ నిబంధనను తాజాగా మార్చుకుంటున్నట్లుగా ప్రకటించి వైనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
By: Garuda Media | 22 April 2026 5:00 PM ISTఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 ఏళ్లు. అవును.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తనకు తానుగా విధించుకున్న స్వీయ నిబంధనను తాజాగా మార్చుకుంటున్నట్లుగా ప్రకటించి వైనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ తరహా నిర్ణయాలకు మన దేశీయ మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించని దుస్థితి. ఇంతకూ జపాన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏమంటే.. ఇకపై యుద్ధ విమానాలతో సహా ఆయుధాల్ని అమ్మేందుకు పచ్చజెండా ఊపుతూ జపాన్ ప్రధాని సనాయే తకైచీ కొత్త ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.
ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. భౌగోళిక రాజకీయ పరిస్థితులు.. తమ సైన్యం ప్రపంచంతో వ్యవహరించేతీరుపై జపాన్ తన తీరును మార్చుకోవటానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే.. ఈ సంచలన నిర్ణయంతో పాటు.. జపాన్ తనకు తాను కొన్ని కఠిన విధించుకోవటం విశేషం. ఆయుధాల అమ్మకాల విషయంలో తనదైన కొన్ని విధానాల్ని నిర్దేశించుకోవటం గమనార్హం.
ఐక్యరాజ్య సమితి చార్టర్ కు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను అమ్ముతామని జపాన్ ప్రధాని తకైచి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన రక్షణను తాను ఒంటరిగా చూసుకోలేదని.. అందుకే ఇతర దేశాల సహకారం అవసరమన్న వ్యాఖ్యను చేసిన ఆమె వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. ప్రపంచ ఆయుధ మార్కెట్లో తాము అమ్మే యుద్ధ విమానాలు.. ఆయుధాల వివరాల్ని ప్రకటించలేదు. అయితే.. ప్రాశ్చాత్య మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫైటర్ జెట్ లు.. క్షిపణులు.. అత్యాధునిక యుద్ధనౌకలను విదేశాలకు అమ్మాలన్న ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత జపాన్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకున్న సంగతి తెలిసిందే. ఇందులోని నిబంధనల ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠిన నిషేధాన్ని విధించుకుంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా మారుతున్న భద్రతా సమీకరణాల నేపథ్యంలో ఈ బ్యాన్ ను ఎత్తి వేస్తూ.. జపాన్ కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజా నిర్ణయంతో జపాన్ అమ్మకాలు సాగించే ఆయుధాలు పదిహేడు దేశాలు అర్హత సాధించాయని చెప్పాలి. గతంలోని నిబంధనల ప్రకారం జపాన్ కేవలం నిఘా పరికరాలు.. మైన్ స్వీపింగ్ లాంటి ప్రాణాంతకం కాని ఆయుధ సామాగ్రిని మాత్రమే ఎగుమతి చేసేది. ఇప్పుడు ఫైటర్ జెట్ లు అమ్మేందుకు సిద్ధం కావటంతో అమెరికా.. రష్యా.. చైనా లాంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ సరికొత్త పోటీదారుగా మారనుంది.
ఇక్కడ గుడ్ న్యూస్ ఏమంటే.. జపాన్ అమ్మేందుకు వీలుగా తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇకపై యుద్ధ విమానాలు.. ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అర్హత సాధించే దేశాల జాబితాలో భారతదేశం మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. మరింత నాణ్యమైన ఆయుధాల్ని సొంతం చేసుకోవటానికి సరికొత్త సరఫరాదారు భారత్ కు లభించినట్లుగా చెప్పాలి. ఈ నిర్ణయం భారత్ - జపాన్ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పక తప్పదు.
