Begin typing your search above and press return to search.

భారీ విపత్తుపై జపాన్‌లో ఆందోళన… 80% కంటే ఎక్కువ మంది ఇదే భావన

ప్రకృతి వైపరీత్యాలకు పెట్టింది పేరు జపాన్. అయితే, తాజాగా అక్కడి ప్రజల్లో ఒక రకమైన భయం గూడుకట్టుకుంది.

By:  Madhu Reddy   |   10 March 2026 7:00 AM IST
భారీ విపత్తుపై జపాన్‌లో ఆందోళన… 80% కంటే ఎక్కువ మంది ఇదే భావన
X

ప్రకృతి వైపరీత్యాలకు పెట్టింది పేరు జపాన్. అయితే, తాజాగా అక్కడి ప్రజల్లో ఒక రకమైన భయం గూడుకట్టుకుంది. సమీప భవిష్యత్తులో దేశాన్ని మరో భారీ విపత్తు వణికించబోతోందని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2011 నాటి భయంకరమైన సునామీ వంటి విపత్తు మళ్ళీ ముంచుకొస్తుందని జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఆ దేశం ఎదుర్కోబోయే సవాళ్లను, ప్రజల మానసిక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

భయం గుప్పిట్లో జపాన్.. 80 శాతం మందిలో ఆందోళన:

జపాన్‌లో జరిగిన ఒక తాజా సర్వే ప్రకారం, అక్కడి జనాభాలో 84.1 శాతం మంది త్వరలోనే ఒక పెద్ద విపత్తు రాబోతోందని నమ్ముతున్నారు. 2011లో సంభవించిన 9.0 తీవ్రత కలిగిన భూకంపం మరియు సునామీ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో మనందరికీ తెలుసు. సరిగ్గా అలాంటి భయానక సంఘటన మరొకటి ముంచుకొస్తుందని అత్యధిక శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నిరంతరం చిన్నపాటి భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో, ఏదో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందనే భావన జపాన్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

విపత్తు గండం తెలుసు.. కానీ సిద్ధంగా లేరు:

విచిత్రమేమిటంటే, ప్రమాదం వస్తుందని తెలిసినా దానిని ఎదుర్కోవడానికి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరని ఈ సర్వే వెల్లడించింది. ఒకవేళ అలాంటి భారీ విపత్తు సంభవిస్తే, దానిని ఎదుర్కోవడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారని అడిగినప్పుడు.. 69.2 శాతం మంది 'మేము సిద్ధంగా లేము' అని బదులిచ్చారు. కేవలం 20.5 శాతం మంది మాత్రమే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే భయం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇక జపాన్ విపత్తు నిర్వహణలోఎంతో ముందుంటుంది అనుకునే వారికీ ఈ గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

చరిత్ర మల్లి రిపీట్ అవుతుందా?:

2011 విపత్తు జపాన్ ఆర్థిక వ్యవస్థను, జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పటి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు మళ్ళీ అదే స్థాయిలో భయపడుతున్నారంటే, భూగర్భంలో చోటు చేసుకుంటున్న మార్పులు లేదా భౌగోళిక హెచ్చరికలే కారణం కావచ్చు. ఇక ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేరు కానీ, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం ముఖ్యం. రాబోయే గండం గురించి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో, ప్రభుత్వం కూడా అప్రమత్తమై భద్రతా చర్యలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు విశ్లేషకులు.