Begin typing your search above and press return to search.

ఒక్కసారిగా 26 వేల అడుగుల కిందకు విమానం.. గాల్లోనే వీలునామాలు.. ఏం జరిగింది?

అవును... జపాన్ ఎయిర్‌ లైన్స్ బోయింగ్ డ్రీమ్‌ లైనర్ 737 విమానం అకస్మాత్తుగా సుమారు 26,000 అడుగుల కిందకు దిగిపోయింది.

By:  Tupaki Desk   |   3 July 2025 10:58 AM IST
ఒక్కసారిగా 26 వేల అడుగుల కిందకు విమానం.. గాల్లోనే వీలునామాలు.. ఏం జరిగింది?
X

అహ్మదాబాద్ లో ఎయిర్ పోర్టు నుంచి టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన దగ్గర నుంచి అమాంతంగా కిందకు దిగిపోతున్న విమానాలకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ కు చెందిన ఎయిర్ లైన్స్ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిన ఘటన సంచలనంగా మారింది.

అవును... జపాన్ ఎయిర్‌ లైన్స్ బోయింగ్ డ్రీమ్‌ లైనర్ 737 విమానం అకస్మాత్తుగా సుమారు 26,000 అడుగుల కిందకు దిగిపోయింది. ఇదంతా అతిస్వల్ప వ్యవధిలో జరిగిపోయింది. దీంతో... అందులోని ప్రయాణికులు ఆ సమయంలో... తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వారంతా ఆక్సిజన్ మాస్క్‌ లు ధరించి, అవే తమ చివరి క్షణాలు కావచ్చనే భయంలోకి వెళ్లిపోయారు.

ఒక్కసారిగా భీకర కుదుపులు రావడంతో మరికొంతమంది ప్రయాణికులు నిద్ర నుంచి అమాంత మేల్కొని, చావు భయాన్ని చవి చూశారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రయాణికులు వీలునామాలు రాయగా.. మరికొంతమంది బ్యాంక్ అకౌంట్ లాగిన్ డిటైల్స్, పిన్ నెంబర్స్, మరికొన్ని ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అయినవారికి ఫేర్ వెల్ నోట్స్ పంపారు!

అసలేం జరిగింది?:

చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుండి టోక్యోలోని నరిటా విమానాశ్రయానికి జేఎల్8696 విమానం బయలుదేరింది. ఈ సమయంలో విమానం పది నిమిషాల్లోపు 36,000 అడుగుల నుండి 10,000 అడుగుల ఎత్తుకు ఒక్కసారిగా దిగిపోయింది. ఈ సమయంలో కెప్టెన్ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ విమానాశ్రయానికి మళ్లించారు.

ఈ సమయంలో... అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో.. అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇది తమ జీవితాల్లో జరిగిన అతిగొప్ప అద్భుతం అని చెబుతున్నారు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ తీవ్రంగా గాయపడకుండా ల్యాండ్ అవ్వడం గమనార్హం!!

ఈ సందర్భంగా స్పందించిన జపాన్ రవాణా, పర్యాటక మంత్రిత్వ శాఖ... విమానం దిగుతున్న సమయంలో దాని పీడన వ్యవస్థ అత్యవసర హెచ్చరికను ప్రేరేపించిందని. కొన్ని సెకన్లలోనే, ఆక్సిజన్ మాస్క్‌ లు పైకప్పు నుండి పడిపోయాయని.. నిద్రిస్తున్న ప్రయాణీకులను మేల్కొలిపి, విమానంలో గందరగోళం పరిస్థితి నెలకొందని తెలిపింది.

ఈ క్రమంలో స్పందించిన ఓ ప్రయాణికుడు.. తాము బ్రతకలేమనే భయంతో పలువురు వీలునామాలు రాశారని.. వారి ఆర్థిక వివరాలు కుటుంబ సభ్యులకు పంపించారని.. వారితో పాటు స్నేహితులు, బందువులకు ఫేర్ వెల్ నోట్స్ రాశారని తెలిపారు. చాలామంది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారని.. కొందరు స్పృహ కోల్పోతామని భయపడ్డారని తెలిపారు.

బోయింగ్ విమానాలపై మరోసారి చర్చ!:

బోయింగ్ విమానాల పనితీరుపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన చొటు చేసుకోవడం గమనార్హం. జూన్ 12న అహ్మదాబాద్‌ లో బోయింగ్ 787 డ్రీమ్‌ లైనర్ ఘోర ప్రమాదం జరిగి 260 మందిని బలి తీసుకుంది! గత వారం వియత్నాంలో ఆగి ఉన్న విమానాన్ని మరో డ్రీమ్‌ లైనర్ ఢీకొట్టిన ఘటనల తర్వాత ఈ భయంకరమైన ఘటన వెలుగుచూసింది!

మరోవైపు.. జూన్ 12 న అహ్మదాబాద్ లో ఘటన జరిగిన 38 గంటల్లోనే మరో ఎయిరిండియా విమానం టెన్షన్ పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జూన్ 14 తెల్లవారుజామున ఢిల్లీ నుండి బయలుదేరి వియన్నాకు వెళ్తున్న బోయింగ్ 777 విమానం ఒక్కసారిగా 900 అడుగుల మేర కిందికి దిగిపోవడంతో "డోంట్ సింక్" హెచ్చరికను అందుకుంది.

ఈ సందర్భంగా... గత సంవత్సరం అలాస్కా ఎయిర్‌ లైన్స్ బోయింగ్ విమానంలో ఒక డోర్ ప్యానెల్ గాల్లోనే ఊడిపోయిన ఘటన తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. ఈ వరుస ఘటనలు బోయింగ్ విమానాల తయారీలో నాణ్యతను ఎత్తి చూపిస్తున్నాయి!