జపాన్ మరో అద్భుతం.. రాత్రికి రాత్రే 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం!
టెక్నాలజీ సంగతి వస్తే ప్రపంచమంతా ముందుకే పోతోంది కానీ జపాన్ మాత్రం వేరే లెవెల్ అంతే! అక్కడ ఎప్పుడూ పిచ్చెక్కిచ్చే ఆశ్చర్యకర విషయాలను కనిపెడుతూనే ఉంటుంది
By: Tupaki Desk | 10 April 2025 8:30 AM ISTటెక్నాలజీ సంగతి వస్తే ప్రపంచమంతా ముందుకే పోతోంది కానీ జపాన్ మాత్రం వేరే లెవెల్ అంతే! అక్కడ ఎప్పుడూ పిచ్చెక్కిచ్చే ఆశ్చర్యకర విషయాలను కనిపెడుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా అలాంటి ఓ అద్భుతాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదేంటంటే జపాన్ 6 గంటల్లో రెడీ చేసిన 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది.
1948లో కట్టిన చెక్క స్టేషన్‌కు కొత్త లుక్
జపాన్‌లోని వకాయామా ప్రాంతంలోని అరిడా సిటీలో ఉన్న హట్సుషిమా స్టేషన్ గురించి మాట్టాడుతున్నాం. అది చిన్న స్టేషన్. అక్కడి నుంచి రోజుకు 530 మంది అటు ఇటు తిరుగుతుంటారు. అది చాలా పాత చెక్కతో చేసిన స్టేషన్. 1948లో కట్టారట దాన్ని. ఇప్పుడు దాన్ని మార్చాల్సిన టైం వచ్చింది. ఈ పనిని వెస్ట్ జపాన్ రైల్వే వాళ్లు Serendix అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. పని తొందరగా అయిపోవాలని ఆ కంపెనీ వాళ్లు నైరుతి క్యుషు ద్వీపంలోని కుమామోటో ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో 3D ప్రింట్‌లు రెడీ చేశారు. ఈ మొత్తం రెడీ చేయడానికి 7 రోజులు పట్టింది. ఆ తర్వాత ఆ పార్ట్‌లన్నింటినీ మార్చి 24న ఉదయం ఫ్యాక్టరీ నుంచి రోడ్డు మీద దాదాపు 500 మైళ్ల దూరం ఈశాన్యంలో ఉన్న హట్సుషిమా స్టేషన్‌కు తీసుకొచ్చారు.
రాత్రికి రాత్రే పని ఎందుకు పూర్తి చేశారంటే
న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం Serendix కంపెనీలోని ఒక పెద్దాయన మాట్లాడుతూ.. మామూలుగా కన్‌స్ట్రక్షన్ పని అంటే నెలల తరబడి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి రాత్రి ట్రైన్స్ నడవవు కదా. కమర్షియల్ లైన్‌లో కన్‌స్ట్రక్షన్ పని అంటే చాలా రూల్స్ ఉంటాయి. అందుకే టైమ్‌టేబుల్‌కు ఏ ఇబ్బంది రాకుండా రాత్రికి రాత్రే పని పూర్తి చేస్తారు. మార్చి 25 రాత్రి 3D ప్రింటెడ్ పార్ట్‌లతో లారీలు అక్కడికి వచ్చాయి.
రాత్రి 11:57కి లాస్ట్ ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్ళిపోగానే కన్‌స్ట్రక్షన్ పని మొదలుపెట్టారు. ఆరు గంటలు కూడా పట్టకుండా ముందుగా రెడీ చేసిన పార్ట్‌లన్నింటినీ కలిపేసి 100 చదరపు అడుగుల కొత్త మెరిసే స్టేషన్‌ను కట్టేశారు. ఉదయం 5:45కి ఫస్ట్ ట్రైన్ వచ్చే టైంకి అది రెడీగా ఉంది. అయితే టికెట్ మెషిన్, ట్రాన్స్‌పోర్టేషన్ కార్డ్ రీడర్ పెట్టే చిన్న చిన్న పనులు మాత్రం మిగిలి ఉన్నాయి. వెస్ట్ జపాన్ రైల్వే వాళ్లు జూలైలో దాని కోసం కొత్త బిల్డింగ్ కట్టొచ్చని చెప్పారు.
