Begin typing your search above and press return to search.

కింగ్ మేకర్ అయ్యేందుకు ఉత్తరాంధ్రపై పవన్ ప్లానింగ్!

సడెన్ గా ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర అని పవన్ ప్రకటించేశారు. విశాఖపట్నం జిల్లాలో మొదలయ్యే యాత్ర తర్వాత విజయనగరం జిల్లా ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పర్యటనతో ముగుస్తుంది

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:59 AM GMT
కింగ్ మేకర్ అయ్యేందుకు ఉత్తరాంధ్రపై పవన్ ప్లానింగ్!
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రపై కన్నేసినట్లున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే యాత్ర విశాఖపట్నం తో మొదలవ్వబోతోంది. వారాహియాత్రను తూర్పుగోదావరిలోని ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

తర్వాత మరో 8 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ తర్వాత రెండో విడత పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంతో మొదలుపెట్టారు. ఈ జిల్లాలో కూడా ఆరు నియోజకవర్గాల్లో యాత్రచేసి బ్రేక్ ఇచ్చారు.

నిజానికి తాజా యాత్ర రాయలసీమలో మొదలవుతుందని పార్టీ నేతలు గతంలో చెప్పారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాతో పవన్ వారాహి యాత్ర మూడో విడత మొదలవుతుందని అన్నారు. అయితే ఎందుకనో వ్యూహం మారిపోయినట్లుంది.సడెన్ గా ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర అని పవన్ ప్రకటించేశారు. విశాఖపట్నం జిల్లాలో మొదలయ్యే యాత్ర తర్వాత విజయనగరం జిల్లా ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పర్యటనతో ముగుస్తుంది.

మొదటినుండి కూడా పవన్ దృష్టంతా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మీదే ఉంది. జనసేన బలం కూడా ఈ ఐదు జిల్లాల్లోనే ఎక్కువగా ఉందని పవన్ అనుకుంటున్నారు. అందుకనే ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించేటపుడు 34 సీట్లలో ఎక్కడ కూడా వైసీపీని గెలవనీయకూడదని పదేపదే చెప్పింది. ఉత్తరాంధ్రలో కూడా 34 సీట్లే ఉన్నాయి.

అంటే ఈ 68 నియోజకవర్గాలపైనే పవన్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో కూడా జనసేనకు ఎక్కువ ఓట్లొచ్చింది పై ప్రాంతాల్లోనే అని తెలుస్తోంది. కాబట్టి 68 నియోజకవర్గాల్లోనే గట్టిగా దృష్టిపెట్టి పోటీచేసి గెలవాలన్నది పవన్ వ్యూహంగా కనబడుతోంది.

టీడీపీతో పొత్తున్నా లేకపోయినా పవన్ దృష్టంతా 68 నియోజకవర్గాల్లో పోటీచేసి గెలవటంపైనే ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎన్నింటిని గెలుచుకుంటే తాను కింగ్ మేకర్ అయ్యేందుకు అంత అవకాశం ఉంటుందని పవన్ ఆలోచనగా కనిపిస్తోంది.

పవన్ అంచనా ప్రకారం కనీసం 40 నియోజకవర్గాల్లో గెలుచుకుని ముందుగా కింగ్ మేకర్ అయితే అవకాశాన్ని బట్టి ఏకంగా కింగ్ అయిపోవచ్చని అనుకుంటున్నారేమో. అందుకనే పదేపదే తనను ముఖ్యమంత్రిని చేయండని పవన్ జనాలను రిక్వెస్టులు చేస్తున్నది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.