Begin typing your search above and press return to search.

టీడీపీ తమ్ముడికే జనసేన టికెట్...!?

తెలుగుదేశంలో సీటు రాకపోతే జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవడమే. పొత్తులు ఉన్నా భయపడాల్సింది లేదు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:04 AM GMT
టీడీపీ తమ్ముడికే జనసేన టికెట్...!?
X

తెలుగుదేశంలో సీటు రాకపోతే జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవడమే. పొత్తులు ఉన్నా భయపడాల్సింది లేదు. ఎందుకంటే మిత్ర పార్టీయే కదా. గుర్తు వేరు అయినా అన్నీ సేమ్ టూ సేమ్ అని అంటున్నారు. ఈ డైలాగ్ వింటే జనసేనాని అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ గుర్తు రావడం లేదూ. ఆ సినిమాలో పవన్ ఒక పంచ్ డైలాగ్ కొడతారు. సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను మిగిలినది అంతా సేమ్ టూ సేమ్ అని. అదే సీన్ ఇక్కడ.

జనసేనకు ఇచ్చినవి 21 సీట్లు. కానీ ఆ సీట్లలో పోటీ పడుతున్నది జనసేనాని పెండింగులో పెట్టి మరీ కట్టబెడుతున్నది మాజీ తమ్ముళ్లకే అని అంటున్నారు విశాఖ సౌత్ నియోజకవర్గంలో చూస్తే జనసేనలో ఏళ్లకు ఏళ్ళు పనిచేసిన వారు ఉన్నారు. వారిని కాదని చివరి నిముషంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ టికెట్ కొట్టేశారు. ఆయన వద్దు అని సైనికులు అన్నా పవన్ మాత్రం వినిపించుకోలేదు అని అంటున్నారు.

అలాగే పెందుర్తి సీటు విషయం కూడా ఉంది. అక్కడ కూడా పార్టీని నమ్ముకుని పునాదుల నుంచి పనిచేస్తున్న వారు అంతా పక్కకు పోయారు. వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ఇచ్చారు. ఇక అనకాపల్లిలో ఇదే కధ. అక్కడ కూడా వైసీపీ టీడీపీ ఇలా పార్టీలు మారి వచ్చిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టికెట్ ఇచ్చారు.

ఇపుడు చూస్తే పాలకొండ సీటు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ సీటు. ఈ సీటు తీసుకున్నారు. జనసేనలో పనిచేసిన వారికి ఇవ్వవచ్చు కదా. అలా కాకుండా 2014, 2019లలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చూసిన అచ్చమైన టీడీపీ తమ్ముడు నిమ్మక జయక్రిష్ణకు కండువా కప్పి మరీ పవన్ టికెట్ ఇస్తున్నారు అని సైనిక్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే నిమ్మక జయకృష్ణ కూడా పొత్తులో ఈ సీటు జనసేనకు వెళ్ళినా బాధపడలేదు, క్యాడర్ ని కూడా కామ్ గా ఉండమన్నారు. టైం వచ్చాక పార్టీ జెండా మార్చేశారు. టికెట్ పట్టేశారు. ఈ విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో జనసేనకు ఆరు సీట్లు పొత్తులో వస్తే కేవలం రెండు సీట్లలో మాత్రమే ఒరిజినల్ లీడర్స్ పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు అంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వారే అంటున్నారు.

దీని మీద వైసీపీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్ సెటైర్లు వేశారు. పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్ధులు లేక అద్దెకు నాయకులను తెచ్చుకుంటోందని అన్నారు. ఈ అద్దె నాయకులను జనాలు నమ్మరని వైసీపీనే గెలిపిస్తారు అని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా జనసైనికులు మాత్రం వీటి మీద కలవరపడుతున్నారు.