Begin typing your search above and press return to search.

జనసేనకు షాక్ : గాజు గ్లాస్ ఫ్రీ సింబలేనా ?

గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ గానే ఉంటుందా అంటే ఎన్నికల సంఘం ఇప్పటిదాకా పాటించిన నిబంధనలు బట్టి చూస్తే అదే ఖాయం చేసుకోమంటున్నారు.

By:  Tupaki Desk   |   13 April 2024 3:40 AM GMT
జనసేనకు షాక్ : గాజు గ్లాస్ ఫ్రీ సింబలేనా ?
X

గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ గానే ఉంటుందా అంటే ఎన్నికల సంఘం ఇప్పటిదాకా పాటించిన నిబంధనలు బట్టి చూస్తే అదే ఖాయం చేసుకోమంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ గుర్తింపుని పొందకపోతే వారికి ఆ గుర్తుని ఇవ్వరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదేంటి అంటే ప్రజాశాంతి పార్టీకి గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుని కేటాయించింది. ఈసారి ఏకంగా కుండ గుర్తుని ఇచ్చింది.

నిజానికి చూస్తే కేఏ పాల్ తమకు హెలికాప్టర్ గుర్తు కేటాయించనై కోరుకున్నారు. ఈసీని అభ్యర్ధించారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కూడా చాలా చోట్ల పోటీ చేసింది. ఈసారి కూడా పోటీ చేస్తామని అంటోంది. మరి ఆ పార్టీకి గుర్తు అయితే పాతది ఇవ్వలేదు. జనసేనకు మాత్రం గాజు గ్లాస్ గుర్తు ఎందుకు ఇవ్వాలి అన్నది ఒక చర్చగా నడుస్తోంది.

దీని మీద ఈసీ నిర్ణయమే కీలకం. ఈసీ ఫ్రీ సింబల్ గా చేసినపుడు అది ఎవరికైనా ఇవ్వవచ్చు. లేదా జనసేన మరీ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ పార్టీ పోటీ చేసే సీట్లలో మాత్రం ఇచ్చి మిగిలిన చోట్ల కోరుకున్న పార్టీలకు లేదా ఇండిపెండెంట్లకు ఇవ్వవచ్చు. వీటితో పాటుగా మరే రిజిష్టర్ పార్టీ అయినా తాము ఎక్కువ సీట్లకు పోటీ చేస్తామని జనసేన కంటే ఒక సెకన్ ముందు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఆ గుర్తు ఇవ్వవచ్చు.

ఈ విధంగా చూస్తే గాజు గ్లాస్ అన్నది ఇపుడు గాలిలో ఉందనే అంటున్నారు. దాని విషయంలో ఈసీ విచక్షణ అతి ముఖ్యం. ఈసీ ఇవ్వాలి అనుకుంటే జనసేనకు ఇచ్చి ఎవరికీ కూడా ఆ గుర్తుని కేటాయించకనూ పోవచ్చు.కానీ నిబంధనలు చూస్తే ఫ్రీ సింబల్ గా ఉన్న దాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు.

ప్రస్తుతానికి ఫ్రీ సింబల్ గానే ఈసీ జాబితాలో గాజు గ్లాస్ ఉంది కాబట్టి దాన్ని కోరుకోవడానికి చాలా మంది చూస్తారు. కారణం ఏమిటి అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తల పుణ్యమాని అది బాగా నలిగిన గుర్తుగా ఉంది. దాంతో ఆ గుర్తుని తామే దక్కించుకుంటే తాము పోటీ చేసే చోట బాగా ఓట్లు తెచ్చుకోవచ్చు అన్న ఆశ ఎవరికైనా ఉంటుంది.

మొత్తం మీద చూస్తే జనసేన గుర్తు గాజుగ్లాస్ అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఈసీ మాత్రం ఫ్రీ సింబల్ గానే ఉంచేసింది. ఈ పరిణామంతో జనసేనకు టెన్షన్ అయితే పట్టుకుంది అని అంటున్నారు. ఎన్నికల గుర్తు అన్నది అతి ముఖ్యం. ఆ గుర్తు కనుక లేకపోతే గెలుపు మీద తీవ్ర ప్రభావం పడుతుంది.

ఈ విషయంలో జనసేన పెద్దలు ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. అయితే ఈసీ విచక్షణాధికారాలు దృష్టిలో ఉంచుకుంటే జనసేన నేతలు చేసే రిక్వెస్ట్ ని బట్టి వారికే కేటాయించి మిగిలిన చోట్ల ఏ అభ్యర్ధి అడిగినా ఇవ్వకపోవచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.