Begin typing your search above and press return to search.

మండిపోతున్న జనసేన క్యాడర్...సీరియస్ స్టెప్ దిశగా....!?

బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉన్నారు. పవన్ అంటే సీఎం అన్న మాటనే క్యాడర్ అంటుంది. అది ఆయన స్టేచర్ అని కూడా భావిస్తుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 9:43 AM GMT
మండిపోతున్న జనసేన క్యాడర్...సీరియస్ స్టెప్ దిశగా....!?
X

జనసేన రగులుతోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వెండి తెర మీద సూపర్ స్టార్. రాజకీయాల్లో చూస్తే ఆయన జనసేన అధినేతగా ఉన్నారు. బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉన్నారు. పవన్ అంటే సీఎం అన్న మాటనే క్యాడర్ అంటుంది. అది ఆయన స్టేచర్ అని కూడా భావిస్తుంది.


పవర్ ఫుల్ లీడర్ గా పవన్ ఉండాలని కూడా భావిస్తోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు అన్న చాన్సే లేదు అన్నట్లుగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ మాట్లాడడంతో ఇపుడు జనసేన క్యాడర్ టోటల్ గా మండిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో అంతర్మధనం సాగుతోంది


టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా మేము ఆ పార్టీ వెనక నడవడం లేదు, కలసి నడుస్తున్నామని ఇటీవలనే విశాఖలో జరిగిన సభలో పవన్ ప్రకటించారు. దాని అర్ధం తాము సమానంగానే కూటమిలో ఉన్నామని చెప్పడమే అంటున్నారు. ఇక టీడీపీతో పొత్తు ఉన్నా గౌరవప్రదంగా ఉంటుందని కూడా అనేక సార్లు పవన్ చెప్పుకొచ్చారు.


ఇపుడు చూస్తే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు రెండవ మాటే లేదు అని లోకేష్ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే ఏమనుకోవాలని జనసేన ప్రశ్నిస్తోంది. పొత్తులు అన్నవి ఉన్నపుడు నిర్ణయాలు కూడా కలసి తీసుకోవాలని అంతే తప్ప ఏకపక్షంగా ఉండరాదు అని అంటోంది.


చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నపుడు పవన్ స్వయంగా రాజమండ్రి జైలుకు వెళ్ళి పరామర్శించారు అని గుర్తు చేస్తోంది. అదే టైం లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మరీ పొత్తు ప్రకటన చేశారను చెబుతోంది. పవన్ అంతలా గౌరవం ఇచ్చి పొత్తు ధర్మాన్ని కాపాడినపుడు రేపటి ఎన్నికల తరువాత అధికారాన్ని రెండు పార్టీలు పంచుకోవాలి కదా అన్నదే జనసైనికుల ఆవేదన అని అంటున్నారు


పవన్ అవసరం ఉన్నపుడు వాడుకుంటూ కూరలో కరివేపాకులా చేస్తారా అని కూడా మండిపడుతున్నారు. పవన్ ని పట్టుకుని ప్యాకేజీ స్టార్ అని విమర్శలు ప్రత్యర్ధులు చేస్తున్న భరించామని, అదే విధంగా కేంద్రంలోని బీజేపీతో పొత్తు ఉన్నా టీడీపీతో పొత్తు కలిపి ఏపీ ప్రయోజనాల కోసమే తాము పనిచేస్తున్నామని పవన్ చెప్పారని అంటున్నారు. ఆ విధంగా జనసేన బీజేపీతో కూడా వైరం పెట్టుకుందని తీరా ఇపుడు చూస్తే టీడీపీ ఇంతలా మోసం చేస్తుందా అని జనసైనికులు ఫైర్ అవుతున్నారు.


అసలు నారా లోకేష్ ఈ తరహా కామెంట్స్ ఎలా చేయగలిగారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అనడమేంటి అని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే అటు కేంద్రంలో బీజేపితో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్దపడితే ఇపుడు ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసేన క్యాడర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


జనసేనను టీడీపీ దగ్గర తాకట్టుపెట్టారనే ఆరోపణలు వస్తున్న మౌనంగా భరిస్తూ వస్తున్నామని ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చంద్రబాబే అయిదేళ్ళ పాటు సీఎం అయితే మా పవన్ సంగతేంటి అన్న ప్రశ్నతో ఒక్కసారిగా జనసేనలో మంటలు చెలరేగుతున్నాయి. పార్టీ క్యాడర్ లో అంతర్లీనంగా కీలకమైన చర్చ మొదలైంది.

అదే సమయంలో జనసేన గతం వర్తమానం భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోంది. జనసేన పార్టీ స్థాపించి పదేళ్ళైనా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నామని కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ అంటే అంత చిన్న చూపా అన్న ప్రశ్న కూడా సైనికుల నుంచి వస్తోంది.

పవన్ కి ఉన్న క్యాడర్, ప్రజాభిమానం, యువత వెల్లువెత్తిన అభిమానులు వీళ్ళను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోడీ అయినా విలువ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నదని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక పవన్ తీరు చూస్తే ఇటీవల కాలంలో ఆయన టీడీపీని నమ్ముతూ ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారు.

మొన్నటికి మొన్న తమను ఉంటే ఉండండి పొతే పోండి నా దారి చంద్రబాబు దారి అని పవన్ తేల్చి చెప్పేశారు అంటే అయన ఇప్పటికే టీడీపీకి చంద్రబాబు మాటలకు ఓకే అని అంటున్నారా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే అసలు మనకు టికెట్స్ అయినా వస్తాయా అన్నది ఒక సందేహం అయితే ఈ కీలక తరుణంలో జనసేన డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండాల్సింది అలా కాదని సీట్ల కోసం దేబిరించే స్థాయికి రావడం వెనక కారకులు ఎవరు అని కూడా సైనికులు ప్రశ్నించుకుంటున్నారు

ఇక జనసేనకు కూడా చంద్రబాబే టికెట్లు ఇస్తారా అని అడుగుతున్నారు. ఆయనే టికెట్లు ఇస్తే ఇక పార్టీగా ఉండి ఎందుకు, ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని పుచ్చేసుకుంటేనే సరిపోతుందా అని నిలదీస్తున్నారు ఇక జనసైనికుల మనోగతం ఎలా ఉంది అంతే తామంతా పవన్ కోసం పోరాడుతుంటే అయన వెళ్ళి చంద్రబాబు పల్లకీ మోసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు.

ఇలా జనసేనలో ఇపుడు అతి పెద్ద గందరగోళంగా ఉందని అంటున్నారు. ఇక జనసేనలో వేచి చూసేది లేదని . మున్ముందు మనకు సరిగా గౌరవించకుంటే మనదారి మనం చూసుకోవడం మేలు అనే భావనలో జనసైనికులు వచ్చేసారని అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ వెనుక వెళ్ళి 2014 లో ఒకసారి దెబ్బతిన్నామని, అలాగే 2019 లో పరోక్షంగా చంద్రబాబు దెబ్బతీశాడని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. . కనీసం గతంలో ఇచ్చిన మద్దతునైనా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు చేశాడని కూడా ఆరోపిస్తున్నారు.

ఇక మళ్ళీ ఇపుడు మరోసారి మోసపోవడానికేనా పవన్ సిద్ధపడుతున్నారని వారు అంటున్నారు. మోసం చేసేవాడు తప్పు కాదు మోసపోవడం తప్పు అన్న సంగతి అన్ని పుస్తకాలు చదివిన తమ అధినేతకు తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా లేక చివరాఖరున జనసేనను టీడీపీలో విలీనం చేస్తారా అనే అనుమానాలు పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

నిన్న కాక మొన్న తెలంగాణాలో చంద్రబాబు మోసం చేసి పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేశారని, అయినా సరే తమ పార్టీ అధినేతకు ఆలోచన కలగడంలేదని అంటున్నారు. ఏదైనా వచ్చే ఎన్నికల్లో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. తటస్థంగా ఉండిపోవడమే, వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమా అన్నది వాళ్ళు చర్చించుకుంటున్నారని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా పార్టీ అధినేత గాని, అధినాయకత్వం గాని నోరుమెదపకపోవడడంతో జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు మరింత అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. మరి పవన్ కి తాను సీఎం కాను అన్నది ముందే తెలుసా అన్నదే ఇక్కడ వారికి పట్టుకున్న అతి పెద్ద డౌట్ అంటున్నారు.