Begin typing your search above and press return to search.

కూకట్ పల్లిలో జనసేనకు కొత్త సమస్య... ఎవరీ పవన్ కల్యాణ్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా జనసేన రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Nov 2023 6:55 AM GMT
కూకట్  పల్లిలో జనసేనకు కొత్త సమస్య... ఎవరీ పవన్  కల్యాణ్?
X

అత్యంత రసవత్తరంగా జరగబోతోన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా జనసేన రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి తెలంగాణ ఎన్నికలు అత్యంత భారీగా జరగబోతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జనసేనకు హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కూకట్ పల్లి నియోజకవర్గంలో కొత్త సమస్య ఒకటి ఎదురైంది!

అవును... తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్ లో అత్యంత కీలకమైన కూకట్ పల్లి నియోజకవర్గంలో తన అభ్యర్థిని బరిలోకి దింపింది జనసేన. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీ నుంచి జనసేనలో చేరిన ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌ కు ఆ స్థానం కేటాయించింది.

ఈ సమయంలో కూకట్ పల్లిలో కోనింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన నామినేషన్ దాఖలు చేశారని తెలుస్తుంది. ఇది కొణిదెల పవన్ కల్యాణ్ పేరుకు అత్యంత సమీపంగా ఉన్న పేరు కావడం గమనార్హం. ఇదే సమయంలో అతని ఎన్నికల గుర్తు కూడా జనసేన గాజు గ్లాసుని పోలిఉన్నట్లుగా ఉన్న బకెట్ కావడం మరొక ఆసక్తికర అంశం. దీంతో ఇది ఎన్నికల ఎత్తుగడలో భాగమా అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు పలువురు!

కూకట్ పల్లిలో జనసేనను ఇబ్బంది పెట్టడానికి బీఆరెస్స్ సృష్టించిన సమస్య ఇదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... కూకట్ పల్లిలో బీఆరెస్స్ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మాధవరం పోరాడుతున్నారు.

ఇక జనసేన తరుపున పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌ 2018లో కూకట్‌ పల్లి నుంచి టీడీపీ టికెట్‌ ఆశించారు. ఆ సమయంలో ఆ టిక్కెట్ నందమూరి సుహాసినికి ఇవ్వడంతో అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్‌ రేసులో నిలిచారు.

అయితే జనసేనతో పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించింది బీజేపీ అగ్ర నాయకత్వం. దీంతో ఆయన ఈ నెల 6న జనసేన పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు జనసేన నుంచి కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి సరికొత్త సమస్య ఒకటి తెరపైకి వచ్చింది!