Begin typing your search above and press return to search.

టీడీపీ గజపతినగరం సీటుకు జనసేన ఎసరు...?

అలాంటి గజపతినగరం నియోజకవర్గం మీద జనసేన కన్నేసింది. ఈసారి పొత్తులలో భాగంగా ఆ సీటుని జనసేన కోరుకుంటోంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:46 PM GMT
టీడీపీ గజపతినగరం సీటుకు జనసేన ఎసరు...?
X

విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. టీడీపీ పుట్టిన దగ్గర నుంచి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే అందులో అయిదు సార్లు టీడీపీయే గెలిచింది. ఒక విధంగా టీడీపీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.

అలాంటి గజపతినగరం నియోజకవర్గం మీద జనసేన కన్నేసింది. ఈసారి పొత్తులలో భాగంగా ఆ సీటుని జనసేన కోరుకుంటోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన మూడు సీట్లు కోరుకుంటోంది. అందులో గజపతినగరం ఒకటి అని అంటున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నుంచి మూడు సార్లు గజపతినగరం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిన పడాల అరుణ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అలాగే తమకు గజపతినగరంలో మంచి బలం ఉందని జనసేన అంటోంది.

మరో వైపు చూస్తే టీడీపీలో వర్గ పోరు పీక్స్ లో ఉంది. 2014 లో టీడీపీ నుంచి గెలిచిన కొండపల్లి అప్పలనాయుడు 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2024లో తానే పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు పోటీగా మరో నేత అక్కడ ఉన్నారు. ఈసారి టికెట్ తనకే అని ఆయన చెప్పుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీలో ఇద్దరు నేతల మధ్య వార్ సాగుతోంది. దీంతో ఈ వర్గ పోరును చూసిన జనసేన దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని పొత్తులో భాగంగా సీటు తమదేనని చెప్పుకుంటోంది.

జనసేన గజపతినగరం ఇంచార్జిగా వెలమ సామాజికవర్గానికి చెందిన నేతను నియమించారు. గజపతినగరంలో కొప్పుల వెలమ సామాజికవర్గం అధికంగా ఉంటుంది. అలాగే కాపులు కూడా ఉంటారు. జనసేనకు కాపు ఓటు బ్యాంక్ ఎటూ కలసి వస్తుంది కాబట్టి వెలమల నుంచి అభ్యర్ధిని జనసేన ఎంపిక చేసింది అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పట్ల వ్యతిరేకత ఉందని, దాంతో అది కూడా తమకు లాభిస్తుందని జనసేన అంచనా కడుతోంది. దాంతో తమకే టికెట్ ఇవ్వమని ఆ పార్టీ కోరుతోంది.

అయితే గజపతినగరం విజయనగరాన్ని అనుకుని ఉంది. అక్కడ టీడీపీ ఆధిపత్యం రాజకీయంగా ఉంది. కీలకమైన నియోజకవర్గాన్ని వదులుకోవడానికి టీడీపీ అసలు ఒప్పుకోక పోవచ్చు అని చర్చ ఉంది. అయితే జనసేన మూడు సీట్లకు గురి పెడుతోంది. అందులో కీలకమైనవి కూడా ఉన్నాయి.

వాటితో పోలిస్తే గజపతినగరం ఇవ్వడమే బెటర్ అన్న మాట కూడా ఉంది. దాంతో జనసేనకు గజపతినగరం కన్ ఫర్మ్ అని అంటున్నారు. దీంతో జనసేన దూకుడుగా తమ కార్యకలాపాలను చేసుకుంటూ పోతోంది.అ దే టైం లో టీడీపీలో రెండు వర్గాలూ కూడా టికెట్ తమదే అంటున్నాయి. మొత్తానికి పొత్తు రాజకీయంలో సీటు చిచ్చు పెడుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయని అంటున్నారు.