బీజేపీకి వీడుకోలేనా... పవన్ డెసిషన్..!?
ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పొత్తులు అన్నవి సరికొత్త ఎత్తులుగా మారుతున్నాయి.
By: Tupaki Desk | 5 Feb 2024 8:30 AM ISTఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పొత్తులు అన్నవి సరికొత్త ఎత్తులుగా మారుతున్నాయి. ఏపీలో వైసీపీ వ్యతిరేక కూటమి అన్నది జనసేనాని స్లోగన్. ఆయన అందరి కంటే ముందు కుడి ఎడమ తేడాలు లేకుండా అన్ని పార్టీలు ఏకం కావాలని ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పిలుపు ఇచ్చారు.
ఆనాడు బీజేపీతో పొత్తులో ఉండే పవన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ట్యూన్ కలిపింది టీడీపీ తరువాత కాలంలో. కానీ బీజేపీ మాత్రం నాడూ నేడూ ఎలాంటి సౌండూ చేయడం లేదు. ఎన్నికలు కూత వేటు దూరంలోకి వచ్చిన తరువాత కూడా కమలం పార్టీ నుంచి చడీ చప్పుడూ లేకపోవడం ఒక ఎత్తు అయితే బీజేపీ ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు.
మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని సోము వీర్రాజు కుండబద్ధలు కొట్టారు. సోము వీర్రాజు అంటే కేంద్ర బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు అని పేరు. పైగా ఆయన బీజేపీలో ఆరెస్సెస్ కాలం నుంచి నుంచి ఉన్నారు. ఆయన అలా అన్నారూ అంటే అధినాయకత్వం ఆంతర్యం అందులో వెతికి చూడాలని అంటున్నారు.
ఈ నేపధ్యంలో పవన్ ఢిల్లీ టూర్ మీద ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. మామూలుగా చూస్తే పవన్ జనవరి చివరిలో ఢిల్లీ వెళ్లి కేంద్ర బీజేపీ నాయకత్వంతో పొత్తుల గురించి మాట్లాడుతారని, మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకుని వస్తారని ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది. కానీ పవన్ అయితే ఢిల్లీ వైపు చూడలేదు.
మరి దాని వెనక ఏముంది ఏ రకమైన సంకేతాలు ఉన్నాయన్నది ఎవరికీ తెలియడం లేదు. ఇంకో వైపు చూస్తే పవన్ టీడీపీతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. వరసబెట్టి ఆయన చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం ఈ రెండు పార్టీలు వేచి చూసే టైం కూడా అయిపోతోంది అని అంటున్నారు.
ఇక పొత్తులలో స్పెషలిస్ట్ చంద్రబాబు వద్ద ప్లాన్ బీ కూడా రెడీగా ఉంది అని అంటున్నారు. ప్లాన్ బీలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ చేరుతారా అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇక పొత్తుల విషయంలో చర్చలు ఒక కొలిక్కి తెస్తున్న చంద్రబాబు పవన్ బీజేపీ విషయంలో ఏమి చేస్తారు అన్నది ఆసక్తికరమే అంటున్నారు. చంద్రబాబు అయితే బీజేపీతో పొత్తులో లేరు. ఆయన బీజేపీ వస్తే ఒకే అని అన్నట్లుగా ఉన్నారు.
కానీ పవన్ విషయం అలా కాదు, ఆయన 2020 జనవరి నుంచి బీజేపీతో ఏపీలో పొత్తులో ఉన్నారు ఇప్పటికి నాలుగేళ్లుగా కమలంతో కలసి నడుస్తున్నారు. రీసెంట్ గా ఆయన తెలంగాణా ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీతో కలసి సభను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని కావాలని గట్టిగా కోరుకున్నారు. ఇటీవలనే అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా అయోధ్య వెళ్లి వచ్చారు.
మొత్తానికి బీజేపీలో మోడీ పట్ల ఎంతో అభిమానం చూపే పవన్ ఏమి చేస్తారు అన్నది కీలకమైన విషయం. పవన్ అయితే బీజేపీతో నడిచేది ఉంటుందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. ఏపీ వరకూ చూస్తే పవన్ రాజకీయ టార్గెట్ వేరు. ఆయనకు జగన్ గద్దె దిగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మళ్లీ సీఎం కాకూడదు. అదే టైం లో తాను బీజేపీతో కలసి పోటీ చేస్తే గెలుపు ఆశలు ఎంతవరకూ ఉంటాయో తెలియదు అని ఆయనే చెప్పుకున్నారు. పైగా ఓట్లు చీలి వైసీపీ బ్రహ్మాండంగా మరోసారి అధికారంలోకి వస్తుందని కూడా లెక్క ఉంది.
అందుకే పవన్ బీజేపీ పొత్తులోకి రాకపోతే ఆ పార్టీకి వీడుకోలు ఇస్తారా అన్న చర్చ అయితే ఇపుడు సాగుతోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ విషయం పవన్ ఆలోచనలు ఏపీలో పొత్తులు అతి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి అంటున్నారు.
