Begin typing your search above and press return to search.

తగ్గింది సీట్లు కాదు పవన్...!

అదే గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు ఉండాలని అంటున్నారు

By:  Tupaki Desk   |   14 March 2024 3:30 AM GMT
తగ్గింది సీట్లు కాదు పవన్...!
X

పవన్ కళ్యాణ్ తన సహజ ధోరణిలో రాష్ట్ర ప్రగతి కోసం పొత్తు అంటున్నారు. అంతే కాదు ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం దేశం కూడా ప్రమాదంలో పడిపోతాయని కూడా అంటున్నారు. సీట్లు పొత్తులో భాగంగా బాగా తగ్గినవి జనసేనకే. 2019లో అర శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు, ఆరు ఎంపీ సీట్లు అంటే చిన్న విషయం కాదు. బీజేపీ అలా డిమాండ్ చేసి మరీ రాబట్టుకుంది.

అదే గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు ఉండాలని అంటున్నారు. కానీ పవన్ కి ఇచ్చిన సీట్లు అసెంబ్లీ చూస్తే 21, ఎంపీ సీట్లు చూస్తే రెండంటే రెండు. దాంతో పవన్ కేంద్ర మంత్రి ఆశలు కూడా వమ్ము అయ్యేలా ఈ నంబర్ ఉందని అంటున్నారు. ఇద్దరు ఎంపీలనూ గెలిపించుకున్నా కేంద్ర మంత్రివర్గంలో పెద్ద పీట వేస్తారా అన్నది ఇపుడు వస్తున్న డౌట్.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సీట్ల తగ్గుదల చూడవద్దు అని అంటున్నారు. కానీ సీట్ల తగ్గుదల అన్నది ఆయన పొలిటికల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది అని జనసేన నేతలు మధన పడుతున్నారు. పవన్ సీఎం మెటీరియల్ అని వారి భావన. కింగ్ లేదా కింగ్ మేకర్ ఈ రెండింటిలో పవన్ ఉంటారని వారు ఆశించారు. కానీ అతి తక్కువ సీట్లతో పవన్ ఇపుడు ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.

మరో వైపు చూసుకుంటే పవన్ పొత్తు పార్టీలలో బాగా అన్యాయానికి గురి అయ్యారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా పవన్ రాజకీయ భవిష్యత్తుని చంద్రబాబు నాశనం చేశారు అని విమర్శలు చేశారు. జనసేన ఆశలను కూడా అలా నీరు గార్చారని ఆయన అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ తగ్గడంలోనే నెగ్గడం అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో చూస్తే అది ఉల్టా పుల్టా అవుతుంది. ఇక్కడ ఓడినా గెలిచినట్లుగా చెప్పుకోవాలి. తగ్గుతూ పోతూంటే గెలుపు ఎలా దక్కుతుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి కానీ ఆయనను నమ్ముకున్న జనసేనకు కానీ అదే విధంగా ఎన్నో ఆశలు పెంచుకున్న ఒక బలమైన సామాజిక వర్గానికి కానీ 2024 ఎన్నికలు అతి కీలకంగా మారాయి.

ఈసారి ఎన్నికల్లో కనుక జనసేన పట్టుబడితే కనీసంగా నలభై సీట్లు దక్కుతాయన్నది జనసేనతో పాటు పార్టీలకు అతీతంగా అందరి భావన. కానీ అందులో సగమే దక్కాయి. దాంతో పవన్ పొలిటికల్ ఇమేజ్ మీద ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. రాజకీయాల్లో త్యాగాలు చేస్తూ పోతే మిగిలేది త్యాగరాజు అన్న పేరు తప్ప మరేమీ కాదని అంటున్నారు.

రాజకీయాల్లో అవకాశాలను అందుకోవాలని వాటిని వేటాడాలి. వచ్చిన వాటిని బలవంతంగా అయినా తమ వైపు ఉంచుకోవాలి అని అంటారు. కానీ పవన్ ఈ విషయంలో పార్టీ శ్రేణులు అనుకున్న విధంగా వ్యవహరించలేకపోయారు అని అంటున్నారు. దాని వల్ల రేపటి ఎన్నికల్లో ఓట్ల బదిలీ సరిగ్గా జరగకపోతే దానికి కారణం పవన్ తో పాటు చంద్రబాబు కూడా అవుతారు అని అంటున్నారు.

పవన్ ని ఒప్పించి సీట్లు తగ్గించవచ్చు కానీ ఆయన వెనక ఉన్న వారి ఆకాంక్షలను టీడీపీ గుర్తించకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి హరిరామజోగయ్య అనేక సార్లు హెచ్చరించారు. కానీ చివరికి ఫలితం మాత్రమే ఇలాగే వచ్చింది. దీంతో పవన్ రాజకీయంగా పట్టు విడుపుల విషయంలో ఎలా ఉంటారు అన్నది కూడా అర్ధం అయింది అని అంటున్నారు.