టీడీపీని అంటే జనసేన ఇంచార్జి సస్పెండ్ నా ?
కూటమి పార్టీలు మిత్రులుగా ఉన్నాయి. అధికారంలో ఉన్నాయి. అంతమాత్రం చేత పొరపొచ్చాలు రావని లేవని కాదు, ఒకే పార్టీలోనే నేతల మధ్య విభేదాలు వస్తాయి
By: Tupaki Desk | 11 July 2025 3:15 PM ISTకూటమి పార్టీలు మిత్రులుగా ఉన్నాయి. అధికారంలో ఉన్నాయి. అంతమాత్రం చేత పొరపొచ్చాలు రావని లేవని కాదు, ఒకే పార్టీలోనే నేతల మధ్య విభేదాలు వస్తాయి. అలాంటిది టీడీపీని ఏదో అన్నారని సొంత పార్టీ మీద జనసేన వేటు వేసింది. ఇదిపుడు ఆ పార్టీతో పాటుగా రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. ఎందుకంటే ఈ తరహా సస్పెన్షన్లు గతంలో లేవని అంటున్నారు
జనసేన పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యేకు ఆ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. మీ సేవలు చాలు పార్టీకి దూరంగా ఉండండి అని శ్రీముఖం పంపించింది. రాజకీయంగా సంచలనం రేకెత్తించిన ఈ నిర్ణయం వెనక విషయం ఏమిటి అన్నది చూస్తే కనుక తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ అయిన టీవీ రామారావుని పార్టీ ఆ పదవి నుంచి తప్పించింది. అంతే కాదు ఇక మీదట ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు జనాసేన పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటన మేరకు టీవీ రామారావు కొంతకాలంగా పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు. అంతే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కూటమి స్పూర్తికే విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటివి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా జనసేన అధినాయకత్వం దృష్టికి వచ్చాయని అందుకే క్రమ శిక్షణా చర్యల కింద ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు.
తక్షణమే మిమ్మల్ని పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పించడం జరిగిందని ఇక పార్టీ యాక్టివిటీస్ కి కూడా మీరు దూరంగా ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. తుది నిర్ణయం తీసుకునేంతవరకూ పార్టీకి దూరంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక దీని కంటే ముందు టీవీ రామారావు చేసిన ఒక వివాదాస్పద ట్వీట్ వల్లనే ఆయనకు ఈ వేటు పడిందని అంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి గౌరవం తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అందులో విమర్శించారు. సొసైటీలు ఏఎంసీల ఏర్పాటులో జనసేన నాయకులను కార్యకర్తలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.
పొత్తు ధర్మాన్ని జనసేన పాటిస్తూంటే ఆ నిబద్ధత టీడీపీలో ఎక్కడా కనిపించడం లేదని టీవీ రామారావు విమర్శించారు. ఈ విషయంలో కూటమి పెద్దలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇదే తీరున ఉంటే మాత్రం రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని టీవీ రామారావు చెప్పడం విశేషం.
మరి ఆయన రాసిన దాంట్లో కొంత విమర్శ అయితే ఉండవచ్చు కానీ విషయం ఉంది కదా అని అంటున్నారు. అదే సమయంలో ఏమి జరిగిందో వాకబు చేసి సమస్యను సర్దుబాటు చేయకుండా టీడీపీ మీద గొంతు ఎత్తిన వారి మీద వేటు వేస్తూ పోతే అది జనసేనలో నేతలకు ఏమి సంకేతం ఇస్తుందని అంటున్నారు. అంతే కాదు ఎంత పొత్తు ఉన్నా సొంత పార్టీని కూడా చూసుకోవాలి కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం ఇపుడు గోదావరి జిల్లాలలో రెండు పార్టీల మధ్య అతి పెద్ద చర్చగా మారుతోంది.
