ఉత్తరాంధ్ర పైన జనసేన ఫోకస్!
ఏపీలో మూడవ పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన రానున్న రోజులల్లో రెండవ పెద్ద పార్టీగా ఎదగాలని చూస్తోంది.
By: Tupaki Desk | 19 April 2025 12:00 AM ISTఏపీలో మూడవ పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన రానున్న రోజులల్లో రెండవ పెద్ద పార్టీగా ఎదగాలని చూస్తోంది. అది జరగాలీ అంటే ఏపీలో వైసీపీని వీక్ చేసి ఆ ప్లేస్ లోకి వెళ్ళాలని చూస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అందులో జనసేన కీలకంగా ఉండటంతో పార్టీని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఎక్కువ అయ్యాయి.
ఇప్పటిదాకా జనసేన ఉభయ గోదావరి జిల్లాలలోనే పార్టీని పటిష్టం చేసింది. ఆ రెండు జిల్లాలలో అనూహ్యంగా తన బలాన్ని పెంచుకుంది అదే సమయంలో వైసీపీ నేతలు కూడా జనసేనలోకి క్యూ కట్టారు. వారు వైసీపీలో ఉంటే గెలవలేమనే ఆందోళనకు గురు అయ్యారు. ఆ విధంగా సామాజిక పరిణామాలను మార్చి వారిపైన ఒత్తిడి పెరిగేలా జనసేన వేసిన వ్యూహం ఫలించింది.
దాంతో గోదావరి జిల్లాలలో 2019 ఎన్నికలో నూటికి ఎనభై సీట్లు గెలుచుకున్న వైసీపీ 2024 నాటికి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడి పోయింది. గడచిన పది నెలల కాలంలో ఎంతో మంది కీలక నేతలను కూడా ఆ పార్టీ పోగొట్టుకుంది. దాంతో అక్కడ జనసేన మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయింది. వైసీపీని వీక్ చేయడంలో తన సత్తాను చాటుకుంది.
ఇపుడు ఉత్తరాంధ్రా మీద జనసేన చూపు పడింది అని అంటున్నారు. ఇక్కడ కూడా బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. జనసేన దానికి తన రాజకీయ ఎత్తుగడలను కూడా పదును పెట్టి మరీ వైసీపీని నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉంది. వైసీపీలో బలమైన నాయకులకు జనసేన రెడ్ కార్పెట్ పరచేలా పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు.
రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలో బిగ్ షాట్ అనదగిన ఒక వైసీపీ కీలక నాయకుడు చేరుతారని అంటున్నారు. ఆయన చేరితే కనుక రెండు జిల్లాలలో ఉన్న ఆయన పరివారంతో పాటు ఆయన అనుచరులు అతి పెద్ద బలగం కూడా జనసేన గూటికి వస్తుందని అంటున్నారు. అదే విధంగా విజయనగరం జిల్లాలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని చేసిన నాయకుడు కూడా జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు కూడా బలం బలగం చాలానే ఉన్నాయి.
అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా బిగ్ షాట్ వైసీపీ నుంచి జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రగా ఉందని అంటున్నారు. అలాగే వైసీపీలో కీలక పదవులు చేపట్టి ఇపుడు ఓడి ఖాళీగా ఉన్న వారు జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
విశాఖ జిల్లాలో చూస్తే ఒక మాజీ మంత్రి కూడా ఆ వైపునకు వస్తారని అంటున్నారు. ఆయన తనకు రాజకీయాలు వద్దు అని వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇపుడు ఆయన ఆయన చూపు జనసేన వైపు ఉందని అంటున్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. దాంతో ఆయన చేరడం ఖాయమే అని అంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో కూడా కీలక నియోజకవర్గాలలో వైసీపీ నేతలు డల్ గా ఉన్నారు. వారు అయితే టీడీపీ లేకపోతే జనసేన అని ఆప్షన్లు పెట్టుకున్నారని టాక్. అయితే ఇన్నాళ్ళూ ఇలాంటి చేరికలకు జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ ఇపుడు మాత్రం వారిని చేర్చుకోవాలని అనుకుంటోందిట.
మొత్తం మీద ఉత్తరాంధ్రాలో బీసీలుగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు జనసేనలో చేరి చక్రం తిప్పాలని ఉబలాటపడుతున్నారని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలో వైసీపీని మరింతగా దెబ్బ తీసే రాజకీయ కార్యక్రమం మొదలవుతోందా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
