జనసేనలో ఆ ఇద్దరు సీనియర్ల గురించే ?
జనసేనలోకి 2024 ఎన్నికల ముందు అనేక మంది నాయకులు వచ్చి చేరారు. వారిలో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు.
By: Tupaki Desk | 26 May 2025 9:27 AM ISTజనసేనలోకి 2024 ఎన్నికల ముందు అనేక మంది నాయకులు వచ్చి చేరారు. వారిలో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగిన వారూ ఉన్నారు. అలా చూస్తే జనసేన తరఫున గెలిచిన 21 మంది లో ఇద్దరు సెనైయర్ ఎమ్మెల్యేల గురించి చర్చ సాగుతోందిట.
ఆ ఇద్దరిలో ఒకరు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మరొకరు అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అని అంటున్నారు. మండలి ఉప సభాపతిగా పనిచేశారు. ఆయనకు మంత్రి కావాలని కోరిక ఉంటే చంద్రబాబు ఆయనకు ఉప సభాపతి అవకాశం ఇచ్చారు.
అయితే ఈసారి తప్పక మంత్రి కావాలనే ఆయన పోటీ చేసారు. ఆయన జనసేనలో చేరి మరీ టికెట్ సాధించారు. కూటమి పొత్తుల వల్ల సులువుగానే ఆయన గెలుపు తీరం చేరుకున్నారు. అయితే గెలిచిన తర్వాత ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు తప్ప అమాత్య కిరీటం దక్కలేదు
రాజకీయంగా కేలకమైన ప్రాంతం బలమైన సామాజిక వర్గం రాజకీయ కుటుంబం, అనుభవం సీనియార్టీ అన్నీ ఉన్నా మండలికి మంత్రి పదవి మాత్రం లభించలేదు. దాంతో గత ఏడాదిగా ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారని అంటున్నారు.
మరో సీనియర్ ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణ. ఆయన 2004 నుంచి 2009 దాకా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ మంత్రిగా పూర్తి అధికారాలలతో పనిచేశారు. ఆయన ఎక్సైజ్ శాఖ వంటి కీలక శాఖలను చూశారు. కాంగ్రెస్ లో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక వెలుగు వెలిగిన కొణతాల వైసీపీ ఆవిర్భావంలోనూ కీలకమైన పాత్ర పోషించారు.
ఇక ఆయన 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా తరువాత సైలెంట్ అయ్యారు. సరిగ్గా 2024 ఎన్నికల ముందు ఆయన జనసేనలో చేరడం ఆ పార్టీ టికెట్ దక్కడం జరిగాయి. కొణతాల దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయనకు అనేక అంశాల మీద పట్టుంది. మృదు స్వభావిగా వివాదరహితునిగా కూడా చెబుతారు. ఆయన వెనకబడిన ఉత్తరాంధ్ర సమస్యల మీద అనర్గళంగా ప్రసంగాలు చేయగలరు ఆయనకు కూడా మంత్రి పదవి ఆశలు ఉన్నాయని చెబుతారు. ఆయన ఎందుకో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వస్తున్నారు.
ఇలా జనసేనలో ఎంతో అనుభవం కలిగిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నారు. అయినా తన నియోజకవర్గాలను దాటి బయటకు రావడం లేదు. మరి పార్టీ వారి సేవలను ఉపయోగించుకోవడం లేదా లేక వారే తమకు తాముగా గిరి గీసుకుని ఉన్నారా అన్నదే చర్చగా ఉంది. ఏపీలో మూడవ బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదుగుతున్న జనసేనలో సీనియర్ల సహకారం చాలా అవసరం అని అంటున్నారు.
మరీ ముఖ్యంగా ప్రాంతాల వారీగా నాయకులు తమ గళాన్ని వినిపిస్తూ పార్టీని పటిష్టం చేసే దిశగా కృషి చేస్తే జనసేనకు అది భవిష్యత్తులో మేలు చేకూరుస్తుందని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు నాయకులు మాత్రం తమకు నియోజకవర్గాలే ముఖ్యమని అనుకుంటున్నారు. మరి అధినాయకత్వం వారి సేవలను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాల్సి ఉంది.
