Begin typing your search above and press return to search.

జ‌న‌సేన కోరిక‌ను నెర‌వేరుస్తున్న చంద్ర‌బాబు!

అయితే.. అదేమీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త అంశం కానీ.. ఆ పార్టీ నాయ‌కుల‌కు వ్య‌క్తిగ‌తంగా చేసే మేలు కానీ కాదు.

By:  Tupaki Desk   |   21 May 2025 9:58 AM IST
జ‌న‌సేన కోరిక‌ను నెర‌వేరుస్తున్న చంద్ర‌బాబు!
X

ఆశ్చ‌ర్యం లేదు.. అనుమానం అంత‌క‌న్నా లేదు. కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. వైసీపీ వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డంలో త‌న‌దైన శైలిని అనుస‌రించిన జ‌న‌సేన పార్టీ ప‌ట్ల టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సానుకూలంగా ఉన్న విష‌యం తెలిసిందే. అడిగినా.. అడ‌గ‌క పోయినా.. నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ భాగ‌స్వామ్యం క‌ల్పిస్తున్నారు. అంతేకాదు.. మంత్రివ‌ర్గంలో నూ ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌న‌సేన‌మ‌న‌సులోని మాట‌ను కార్య‌రూపంలో ప‌ట్టేందుకు సీఎం చంద్ర‌బాబు దాదాపు అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.

అయితే.. అదేమీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త అంశం కానీ.. ఆ పార్టీ నాయ‌కుల‌కు వ్య‌క్తిగ‌తంగా చేసే మేలు కానీ కాదు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఎన్నిక‌ల హామీ!. ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. జ‌న‌సేన అప్ప‌ట్లో కీల‌క హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వ‌స్తే.. పేద‌లుతీసుకుంటున్న రేష‌న్‌కు.. బ‌దులుగా త‌త్స‌మాన‌మైన సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామ‌ని.. త‌ద్వారా రేష‌న్ తీసుకునే ల‌బ్ధిదారులు. వారికి న‌చ్చిన బియ్యం.. ఇత‌ర నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నాటి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

దీనివ‌ల్ల రేష‌న్ మాఫియాకు అడ్డుక‌ట్ట వేయ‌డంతోపాటు.. రైతుల‌కు కూడా ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంద‌ని, ఇక‌, వినియోగ‌దారులు, రేష‌న్ కార్డుల ల‌బ్ధి దారుల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌ని ప‌వ‌న్ అప్ప‌ట్లో అంచ‌నా వేశారు. అయితే.. 2019లో పార్టీ అధికారం లోకి రాలేదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ హామీ జోలికి పోలేదు. అయితే.. త‌ర‌చుగా మాత్రం రేష‌న్ అక్ర‌మాల‌కు చెక్ పెట్టాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉప ముఖ్య‌మంత్రి హోదాలో చెబుతున్న విష‌యం తెలిసిందే. పైగా.. పౌర స‌ర‌ఫ‌రాల శాఖకు కూడా జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ మంత్రిగా ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌మ మ‌న‌సులోని కోరిక‌ను తాజాగా సీఎం చంద్ర‌బాబు ముందు పెట్టారు.

``రేష‌న్ మాఫియాను త‌గ్గించాల‌న్నా.. పేద‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన నిత్యవ‌స‌రాలు ద‌క్కాల‌న్నా.. ప్ర‌స్తుతం ఉన్న వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసి.. నేరుగా వారికి సొమ్ములు ఇస్తే.. ల‌బ్ధిదారుల‌కు మేలు క‌లుగుతుంది. వారికిన‌చ్చిన వ‌స్తువుల‌ను వారే కొనుగోలు చేసుకుంటారు. దీనివ‌ల్ల‌మాఫియాను అరిక‌ట్ట‌డంతోపాటు పేద‌ల‌కు కూడా నాణ్య‌మైన స‌రుకులు ఇచ్చిన‌ట్టు అవుతుంది.`` అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రివ‌ర్గ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి తాము గ‌తంలో చేయించిన అంచ‌నాల‌ను కూడా వివ‌రించారు. ఈ విధానంపై సానుకూలంగా స్పందించిన చంద్ర‌బాబు దీనిపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి.. అమ‌లు చేద్దామ‌ని చెప్పుకొచ్చారు. ఇదే జ‌రిగితే.. జ‌న‌సేన హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చిన‌ట్టే అవుతుంది.