రాజ్యసభకు జనసేన...పవన్ కొత్త వ్యూహం ?
అయితే జనసేనకు రాజ్యసభ సీటు కోటాలో పవన్ కి ఎంతో సన్నిహితుడైన పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఉంటారని ప్రచారం సాగుతూ వస్తోంది.
By: Tupaki Desk | 22 July 2025 2:00 PM ISTజనసేన పార్టీకి 2024 ఎన్నికలు ఎంతో కలసి వచ్చాయి. పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడంతో రికార్డుని బద్ధలు కొట్టింది అంతే కాదు పోటీ చేసిన రెండు లోక్ సభ సీట్లను గాజు గ్లాస్ పార్టీ దక్కించుకుంది. ఇక ఇదే ఊపుతో శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలను పంపించగలిగింది. ఇలా దేశంలో ఉన్న నాలుగు చట్ట సభలలో మూడింట జనసేన ప్రాతినిధ్యాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక మిగిలింది అత్యున్నత పెద్దల సభ రాజ్యసభ. అక్కడ జనసేన తొలి ఎంట్రీకి రంగం అయితే సిద్ధం అవుతోంది.
నిజానికి గత ఏడాదిగా నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి కానీ వాటిని టీడీపీ బీజేపీ చెరి రెండూ పంచుకున్నాయి. ఇక 2026లో మరో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో తప్పకుండా తమకు ఒక సీటు కోసం జనసేన పట్టుబట్టనుంది అని అంటున్నారు. ఈసారి కచ్చితంగా రాజ్యసభలో జనసేన అడుగు పెట్టాల్సిందే అన్నది పవన్ ఆలోచనగా ఉందని అంటున్నారు.
ఇక 2026లో చూతే కనుక వైసీపీకి చెందిన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, టీడీపీ నుంచి సానా సతీష్ బాబు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నాలుగు సీట్లను కూటమిలోని మూడు పార్టీలు పంచుకోనున్నాయి. బీజేపీ ఒక సీటు కోరిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక తెలుగుదేశం రెండు తీసుకుంటే ఒకటి జనసేనకు దక్కుతుంది.
అయితే జనసేనకు రాజ్యసభ సీటు కోటాలో పవన్ కి ఎంతో సన్నిహితుడైన పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఉంటారని ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే లింగమనేని టీడీపీకి కూడా అత్యంత సన్నిహితుడు. ఆయనను జనసేన కోటాలో పంపిస్తే వేరే సంకేతాలు వస్తాయని పవన్ ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
అందుకే లింగమనేనికి టీడీపీ తరఫున పంపించాలని కోరనున్నట్లుగా చెబుతున్నారు. ఇక తమ కోటాకు వచ్చే సీటుని జనసేనకు తొలి నుంచి పనిచేసే నేతకు గోదావరి జిల్లాలకు చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని పవన్ ఆలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఆ విధంగా చేస్తే కనుక జనసేన క్యాడర్ కి నైతిక స్థైర్యం వస్తుందని పార్టీ పట్ల మరింత గురి కుదురుతుందని అంటున్నారు. పనిచేసిన వారికి తప్పక గుర్తింపు దక్కుతుంది అన్న సందేశాన్ని ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక లింగమనేని జనసేన క్యాండిడేట్ అని ప్రచారంలో ఉంటే ఇపుడు ఈ కీలక మార్పు ఎందుకు అన్న చర్చ కూడా ఉంది.
అయితే ఇందులో మరో వ్యూహం సైతం ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుని రాజ్యసభకు ఎంపిక చేసి ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్సీ సీటుని గోదావరి జిల్లాలకు చెందిన ఒక బలమైన నాయకుడికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి జనసేన తొలి రాజ్యసభ సభ్యుడిగా పునాది నుంచి ఆ పార్టీలో ఉన్న వారే ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.
అందులో నాగబాబుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ రాజ్యసభ సీటు విషయంలో సీరియస్ గానే ఉన్నారని చెబుతున్నారు. ఇక దీని మీద కూటమి పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో బీజేపీ వైఖరి ఏమిటి అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
