జనసేన ప్లీనరీకి వైసీపీ నుంచి భారీ క్యూ ?
ఇదిలా ఉంటే జనసేన సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంటున్నారు. ఆ చేరికలు అన్నీ కూడా వైసీపీ నుంచే ఉంటాయని అంటున్నారు.
By: Tupaki Desk | 14 March 2025 2:00 AM ISTజనసేన ప్లీనరీ ఈసారి రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన ప్లీనరీ మొదటిసారి పిఠాపురంలో నిర్వహించడం కూడా విశేషంగా చూడాలి.
పవన్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడంతో పిఠాపురం పేరు మారుమోగుతోంది. అటువంటి చోట రాష్ట్ర స్థాయి సభను ఒక పార్టీ నిర్వహించడం కూడా ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ప్లీనరీకి లక్షలలో జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉంది. పార్టీ అత్యంగా బలంగా ఉన్న రీజియన్ ఇదే కావడంతో జన సందోహానికి ఢోకా లేదని భావిస్తున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఈ సభను నిర్వహించాలని ఇప్పటికే జనసేన డిసైడ్ అయింది.
ఇదిలా ఉంటే జనసేన సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంటున్నారు. ఆ చేరికలు అన్నీ కూడా వైసీపీ నుంచే ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కీలక నేతలు మంత్రులుగా గతంలో పనిచేసిన వారు ప్రముఖులు అంతా జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటారు అని అంటున్నారు.
లక్షలాది మంది వచ్చే సభలో జనసేన బలం ఇదని నిరూపించేవిధంగా ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. మరి ఈ చేరేవారిలో బిగ్ షాట్స్ కూడా ఉంటారని అంటున్నారు. మరి వారు ఎవరు ఏ జిల్లాకు చెందిన వారు అన్నది మాత్రం జనసేన నేతలు ఇప్పటిదాకా బయట పెట్టడం లేదు. పైగా దానిని సీక్రెట్ గా ఉంచుతున్నారు.
వైసీపీ నేతలే వీరి చేరికలను చూసి షాక్ తినేలా ఉంటాయని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఎవరూ ఊహించని పేర్లు ఏమైనా ఉంటాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏపీలో అధికారంలో ఉండగానే జనసేనను బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. దానికి తగినట్లుగానే తమకు బలం ఉన్న చోట మాత్రమే కాకుండా బలం లేని ప్రాంతాలలో విస్తరించాలని జనసేన భావిస్తోంది.
దానికి తగినట్లుగానే ఆచీ తూచీ నేతలను చేర్చుకుంటారు అని అంటున్నారు. ప్రతీ చోటా చేరే నేతలకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పలుకుబడి వారికి సొంతంగా ఉండే ఓటు బ్యాంక్ వంటివి ఆధారంగా చేసుకుంటారని అంటున్నారు. అంతే కాదు కూటమిలోని ఇతర పార్టీలకు ఇబ్బంది కాకుండా ఈ చేరికలు ఉంటాయని చెబుతున్నారు. గ్రేటర్ రాయలసీమ నుంచి చేరికలు ఎక్కువగా ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ నుంచి నేతలు భారీగా జనసేనలో చేరేందుకు క్యూ కడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం మేరకు ఏమి జరుగుతుందో.
