విశాఖ సభ జనసేన భవిష్యత్తు వ్యూహాలకు నాంది కాబోతున్నదా ?
ఆగస్టు 30న విశాఖ నగరంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహాసభ నిర్వహించబోతున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2025 5:00 PM ISTప్రస్తుతం జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అధికారంలో ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారనే తెలుస్తున్నది. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇదే. 2029 ఎన్నికల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, జనసేన తన వ్యూహాలను ఎటువంటి మార్పులు చేస్తుందో అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మరో వారంలో దొరకవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
15 వేల మంది జన సైనికులు..
ఆగస్టు 30న విశాఖ నగరంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహాసభ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 15 వేల మంది జనసైనికులు, వీరమహిళలు తరలిరానున్నారు. పవన్ పుట్టినరోజు వేడుకలతో పాటు ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయనుంది.
దిశానిర్దేశం చేయబోతున్నారా?
ఈ మహాసభలో ప్రధానంగా పార్టీ భవిష్యత్ దిశపై పవన్ కల్యాణ్ ఎలాంటి సందేశం ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన ప్రత్యేకంగా 12 కమిటీలను ఏర్పాటు చేసి, అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణలో పెట్టడం ద్వారా ఈ సమావేశానికి ఇచ్చే ప్రాధాన్యత స్పష్టమవుతోంది. కాగా, జన సైనికులు మాత్రం, ఈ సభ ద్వారా పార్టీ కొత్త పంథాలో అడుగులు వేస్తుందా? లేక ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతుందా? అన్న సందేహాలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్‌కు ఉన్న సినీ క్రేజ్ కూడా ఈ సభకు మరింత ప్రాధాన్యం చేకూర్చుతున్నది. గ్యాంగ్ స్టర్ రోల్ లో ఆయన నటించిన ఓజీ(OG) చిత్రం విడుదలకు ముందే ఈ సభ జరగడం, ఇది రాజకీయంగా మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్నది. అభిమానులలో ఒక వర్గం ఆయన నుంచి ఊహించి సర్‌ప్రైజ్ ఉంటుందని భావిస్తున్నది.
మొత్తం మీద, ఈ విశాఖ మహాసభ పవన్ కల్యాణ్ వ్యక్తిగత పుట్టినరోజు వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే దశాబ్దానికి దిశా నిర్ధేశం చేసే వేదికగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
