జనసేనకు.. కాకినాడ ప్లస్.. మచిలీపట్నం డబుల్ ప్లస్.. !
పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చేసరికి జనసేన పార్టీకి రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి ప్లస్ కాగా రెండోది డబుల్ ప్లస్‌గా మారిందన్న టాక్ వినిపిస్తోంది
By: Tupaki Desk | 11 Jun 2025 7:00 AM ISTపార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చేసరికి జనసేన పార్టీకి రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి ప్లస్ కాగా రెండోది డబుల్ ప్లస్‌గా మారిందన్న టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన రెండు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి మచిలీపట్నం. రెండోది కాకినాడ. మచిలీ పట్నం నియోజకవర్గం విషయానికి వస్తే ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయం సాధించారు. ఈయన రాజకీయంగా స్థానికంగా కూడా అందరితోనూ కలిసి ఉంటూ వివాద రహితంగా మంచి పేరు సంపాదించుకున్నారు.
ఇక అభివృద్ధి పరంగా చూస్తే మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయడం, రాజకీయంగా కూటమి నాయకు లతో కలిసి ప్రయాణం చేయడంలోనూ బాలశౌరి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులతోను అయినా కలిసి పని చేస్తున్నారు. ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వైసీపీ హయాంలో ఏ విధంగా అయితే పనిచేశారో.. ఇప్పుడు కూడా అలాగే బాలశౌరి తన సంబంధాలను అనుసరిస్తున్నారు. దీంతో మచిలీపట్నంలో జాతీయ రహదారుల నుంచి పోర్టు నిర్మాణాలు వరకు కూడా అభివృద్ది కనిపిస్తోంది.
అదేవిధంగా కేంద్రంతోను సంబంధాల విషయంలో ఏడాది కాలంలో వల్లభనేని మెరుగైన విధానాన్ని అనుసరించారు. దీంతో జనసేన పార్టీకి మచిలీపట్న పార్లమెంటు స్థానం డబుల్ ప్లస్‌గా మారింది. ఇక కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ విషయం సాధించిన విషయం తెలిసిందే. ఈయన కూడా రాజకీయంగా వివాదాల జోలికి పోకపోయినా స్థానికంగా ఉన్న కూటమి నాయకులతో మాత్రం పెద్దగా కలివిడి చూపలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి పని చేసేందుకు కూటమిలో కొందరు విభేదిస్తున్నారు. ఈ ఒక్కటి మైనస్ గా మారింది. మిగిలిన విషయాలు మాత్రం బాగానే ఉన్నాయని చెప్పాలి. ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన నాయకుల పనితీరుకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే మరింత మెరుగైన రీతిలో కూటమి నాయకులతో కలిసి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా విషయంలో ఎంపీ స్థాయిలో తీసుకున్న చర్యలు కూటమి పార్టీలకు నచ్చకపోవడంతోనే వివాదాలు మొదలయ్యాయన్న చర్చ ఉండటం గమనార్హం.