Begin typing your search above and press return to search.

డ్రైవర్ శ్రీనివాసులు హత్య వెనుక జరిగిందేంటి?

జనసేనకు చెందిన మహిళా నేతల్లో ఒకరైన వినుత ఇంట్లో పదేళ్లుగా పని చేసిన వ్యక్తి హటాత్తుగా హత్యకు గురి కావటం.. అతడి డెడ్ బాడీని చెన్నైలో గుర్తించటం తెలిసిందే

By:  Tupaki Desk   |   13 July 2025 10:36 AM IST
డ్రైవర్ శ్రీనివాసులు హత్య వెనుక జరిగిందేంటి?
X

జనసేనకు చెందిన మహిళా నేతల్లో ఒకరైన వినుత ఇంట్లో పదేళ్లుగా పని చేసిన వ్యక్తి హటాత్తుగా హత్యకు గురి కావటం.. అతడి డెడ్ బాడీని చెన్నైలో గుర్తించటం తెలిసిందే. ఈ హత్యకు జనసేన మహిళా నేత వినుత.. ఆమె భర్త చంద్రబాబు అండ్ కోలు కారణమని చెన్నై మహానగర పోలీస్ కమిషన్ ప్రకటించటం సంచలనంగా మారింది. చెన్నై పోలీసులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చి వినుత దంపతుల్ని అదుపులోకి తీసుకొని చెన్నైకు తరలించిన సంగతి తెలిసిందే.

ఇంతకూ ఈ హత్యకు అసలు కారణమేంటి? ఏ అంశం హత్య వరకు వెళ్లేలా చేసింది? అన్నదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఈ మర్డర్ మిస్టరీకి మూడు ముఖ్య కారణాలుగా భావిస్తున్నారు. ఇందులో ఏదో ఒక అంశం హత్యకు కారణమని భావిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలానికి చెందిన 22 ఏళ్ల శ్రీనివాసులు అలియాస్ రాయుడు దాదాపు పదేళ్లుగా వినుత ఇంట్లో సహాయకుడిగా.. డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

అంతటి నమ్మకస్తుడ్ని వినుత దంపతులు ఎందుకు హత్య చేసి ఉంటారు? అక్కడి వరకు విషయం ఎందుకు వెళ్లి ఉంటుంది? అన్న ప్రశ్న వద్ద.. విషయం ముందుకు వెళ్లని పరిస్థితి. ఇలాంటి వేళ.. విశ్వసనీయ వర్గాలు.. వినుత దంపతులకు సన్నిహితులుగా ఉండే శ్రేయోభిలాషులు.. మిత్రులు.. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు అంశాల్లోనే ఈ హత్యకు కారణంగా పేర్కొంటున్నారు.

వాదన 1

వినుత జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆమె రాజకీయ ప్రత్యర్థి.. మిత్రపక్షమైన టీడీపీ ఎమ్మెల్యే అన్న విషయం అందరికి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వినుత జనసేన నుంచి పోటీ చేసి 5274 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా.. వైసీపీ ప్రభుత్వంలో ఆమె యాక్ట్టివ్ గా ఉండేవారు. స్థానిక వైసీపీ నేతల్ని తట్టుకొని నిలబడిన ఆమె.. 2024 ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ వస్తుందని భావించారు. అయితే.. కూటమి లెక్కల్లో భాగంగా ఆమెకు టికెట్ మిస్ అయ్యింది.

టీడీపీ నేత సుధీర్ రెడ్డికి టికెట్ లభించటం.. ఎమ్మెల్యేగా గెలవటం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎమ్మెల్యేకు.. వినుత దంపతులకు మధ్య పొసగకపోవటం.. ఈమధ్య కాలంలో వీరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చినట్లుగా చెబుతారు. ఈ క్రమంలో శ్రీనివాసులు వినుత ఇంటి విషయాల్ని అధికార పార్టీ కీలక నేతకు సమాచారం ఇచ్చారని.. ఇదే అతని హత్యకు కారణమని భావిస్తున్నారు.

వాదన 2

పదేళ్లుగా వినుత ఇంట్లో ఉన్న నేపథ్యంలో శ్రీనివాసులుకు.. వారి ఇంటి విషయాలన్నింటిపైనా అవగాహన ఉన్నట్లు చెబుతారు. వినుత దంపతుల వ్యక్తిగత అంశాలు తెలియటం.. అతను ఆయా అంశాల్లోకి జోక్యం చేసుకోవటం కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు.

వాదన 3

శ్రీనివాసులు హత్య జరిగిన వేళ.. పైన ప్రస్తావించిన రెండు కారణాలకు సంబంధం లేని మూడో వాదన కూడా వినిపిస్తోంది. హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి శ్రీనివాసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. గత నెల 22న వినుత దంపతులు ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన పదిహేను రోజులకే శ్రీనివాసులు హత్య చోటు చేసుకోవటం గమనార్హం.

ఈ మూడు వాదనల్లో ఏది నిజం?.. ఏ అంశం హత్య వరకు విషయం వెళ్లేలా చేసిందన్నది ప్రశ్నగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు వినుత దంపతులు.. వారు నియమించిన వ్యక్తులు కారణమని చెన్నై పోలీసులు చెబుతున్నారు. వినుత దంపతుల్ని విచారణ అనంతరం ఈ అంశంపై మరింత క్లారిటీ వస్తుందని చెప్పాలి.