సేనకు నవ సూత్రాలు... పవన్ చెప్పిందిదే !
ఏ పార్టీలో అయినా అధినాయకత్వ సరిగ్గా గైడ్ చేస్తే పార్టీ జనాలు సరిగ్గానే ఉంటారు. ఇది ఎన్ని పార్టీలలో జరుగుతోందో తెలియదు కానీ జనసేన మాత్రం తమ పార్టీ వారికి కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
By: Satya P | 15 Aug 2026 7:48 AM ISTఏ పార్టీలో అయినా అధినాయకత్వ సరిగ్గా గైడ్ చేస్తే పార్టీ జనాలు సరిగ్గానే ఉంటారు. ఇది ఎన్ని పార్టీలలో జరుగుతోందో తెలియదు కానీ జనసేన మాత్రం తమ పార్టీ వారికి కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాష జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అలాగే తీరు కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలని కోరింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు పార్టీ నేతలు క్యాడర్ కోసం ఆయన కీలక సూచనలు చేశారు.
దూషణలకు దూరంగా :
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులలో కానీ లేదా పార్టీ నేతలు వివిధ సందర్భాలలో స్పందించేటపుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలలో సూచించారు. ముఖ్యంగా వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే అసభ్య పదజాలాల్ని వినియోగించడం మానేయాలని కోరారు. సహనం అలాగే సంయమనం పాటించాలని కోరారు.
మహిళల పట్ల గౌరవించి :
జనసేన తన పార్టీ నేతలు క్యాడర్ కోసం నవ సూత్రాలను విడుదల చేసింది. అందులో మొదటిది వ్యక్తిగత విమర్శలు వద్దు అని ఉంది. అలాగే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఎవరైనా స్పందించాలని సూచించింది. విషయం మీద మాట్లాడేటపుడు అనవసర ఆవేశ కావేశాలు ప్రదర్శించవద్దని మహిళల పట్ల గౌరవించి మాట్లాడాలని కోరారు. ఇక పార్టీలో జరిగే అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో పెట్టి అక్కడ వాటి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదు అని స్పష్టం చేశారు.
పార్టీ లైన్ దాటొద్దు :
జనసేన భావజాలం మీద బహిరంగంగా విమర్శలు చేసే వారిని అసలు ఉపేక్షించమని కూడా పేర్కొన్నారు. ఇక క్రమశిక్షణ అన్నది అత్యంత ప్రధానం అని గుర్తు చేశారు. ఇతర పార్టీల వారు రాజకీయ ప్రత్యర్ధులు ఎవరైనా రెచ్చగొడితే క్రమశిక్షణను విస్మరించి హద్దులు దాటి మాట్లాడితే మాత్రం సహించేది లేదని కూడా స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వారి వలలో పడవద్దు అని తగిన విధంగా స్పందించాలని పార్టీ నేతలకు సూచించారు.
పనితోనే పదవులు :
ఎవరైతే నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తారో వారికే పదవులు వరిస్తాయని జనసేన మరోమారు స్పష్టం చేసింది. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అన్నది హైకమాండ్ ప్రతీ సందర్భంలోనూ గుర్తిస్తుందని వారు అంతా దృష్టిలో ఉంటారని కూడా పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో పార్టీ మీద వచ్చే ఎటువటి వ్యతిరేక ప్రచారాన్ని అయినా తిప్పికొట్టాలని కూడా సూచించారు. పార్టీలో నాయకుల మధ్య బయట శక్తులు విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాయని వాటిని తిప్పి కొట్టాలని సదా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.
సైన్యం ఫాలో అవాల్సిందే :
సోషల్ మీడియా పోస్టుల విషయంలో కానీ ఇతర వేదికల మీద కానీ మాట్లాడేటపుడు పోస్టులు పెట్టేటప్పుడు తగిన విధంగా అప్రమత్తత అవసరం అని పార్టీ హై కమాండ్ చెప్పిన నేపధ్యం అలాగే అసభ్య పదజాలం మానుకోవాలని చేసిన సూచనలు ఇవన్నీ కూడా సైన్యం తప్పక పాటించాల్సిందే అంటున్నారు. ఈ మధ్య ఒక జిల్లాలో కూటమి నేతల మధ్యనే బాహాటం అయిన విభేదాలు నేపధ్యంలో జనసేన కీలక నేత మీడియా ముందుకు రావడం వంటివి జరిగాయి. ఇలాంటివి దృష్టిలో ఉంచుకుని జనసేన ఈ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది.
