గ్రాఫ్ పరేషాన్: జనసేనలో ఏమైంది ..!
తాజాగా వచ్చిన ఓ సర్వేలో జనసేన గ్రాఫ్ తగ్గిపోయిందని తేలింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా చేపట్టిన ఈ సర్వేలో జనసేన నాయకులపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని తేలింది.
By: Tupaki Desk | 16 July 2025 10:00 PM ISTపార్టీలకు గ్రాఫే ముఖ్యం. నాయకులు ఎంత బలంగా ఉన్నా.. ప్రజల్లో సింపతీని పెంచుకునేందుకు.. ప్రజ ల్లో అభిమానం సొంతం చేసుకునేందుకు పార్టీలకు గ్రాఫ్ చాలా ముఖ్యం. అందుకే చాలా వరకు పార్టీలు ప్రజల్లో తమ గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటాయి. ఏ చిన్న తేడా వచ్చినా.. ప్రజల మధ్యకు వస్తుంటాయి. గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తాయి. తాజాగా వచ్చిన ఓ సర్వేలో జనసేన గ్రాఫ్ తగ్గిపోయిందని తేలింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా చేపట్టిన ఈ సర్వేలో జనసేన నాయకులపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని తేలింది.
ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై రెండు మాసాల కిందట ఉన్న ప్లస్.. ఇప్పుడు మైనస్‌గా మారిందన్నది.. తాజా సర్వే పేర్కొన్న విషయం. మొత్తంగా జనసేన పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవ ర్గాల్లో చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయని సర్వే తెలిపింది.
1) గత ఎన్నికల తర్వాత.. ప్రజలకు కనిపించడం లేదు: ఇది ముమ్మాటికీ వాస్తవం. కూటమి పార్టీల్లో బీజేపీ, జనసేన నాయకులు ప్రజల మధ్యకు వెళ్లడం లేదన్నది వాస్తవం. కనీసం టీడీపీ అయినా.. ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజలకు చేరువ అవుతోంది. ఈ వ్యవహారంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
2) పనులు చేయడం లేదు: ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా పింఛన్ల కోసం వేచి చూస్తున్నవారు, రేషన్ కార్డులు కోరుతున్నవారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తమ అవసరాలకు నిధులు కోరుతున్న వారు కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇవి అంతో ఇంతో ముందుకు సాగుతున్నాయి. కానీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం తేడా కొడుతోంది. ప్రజల విన్నపాలను వారుపట్టించుకోవడం లేదు. ఇది మరో మైనస్ అయిందని సర్వే పేర్కొంది.
3) నాయకులకు- కార్యకర్తలకు మధ్య సంబంధాలు కట్: ఇది మరింత ఎక్కువగా ఎమ్మెల్యేలు ప్రాతిని ధ్యం నియోజకవర్గాల్లోనే కనిపిస్తోందని సర్వే పేర్కొంది. సాధారణంగా జనసేనకు ప్రత్యేకంగా కార్యకర్తలు ఎవరూ లేరు. మెగా అభిమానులే పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులే పార్టీ కార్యకర్తలు. అయితే.. వీరికి కూడా పనులు ఉంటాయికదా!? కానీ.. ఎమ్మెల్యేలు వీరికి కూడా పనులు చేయించలేక పోతున్నారన్న వాదన బలంగానే వినిపిస్తోంది. దీనికి ప్రధానంగా నాయకులకు-నాయకులకు మధ్య సంబంధాలు లేకపోవడమేనని సర్వే పేర్కొంది. ఫలితంగా జనసేన గ్రాఫ్ తగ్గుతోందని వెల్లడించింది.
