జాతీయ పార్టీగా జనసేన.. కేరళంలో పార్టీ విస్తరణకు ప్రణాళిక!
సినీ హీరోగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు దక్షిణాదిలో మంచి ఇమేజ్ ఉంది. గత ఎన్నికల్లో ఏపీలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన పవన్, ప్రధానంగా కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
By: Tupaki Political Desk | 20 April 2026 12:30 PM ISTజనసేన పార్టీని జాతీయస్థాయిలో విస్తరించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాదిలో పార్టీ విస్తరణ ప్రణాళికను అమలుకు నాంది పలికింది. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన జనసేన ఆ తర్వాత తెలంగాణలోనూ చురుగ్గా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలంగా ఉన్న జనసేన తాజాగా దక్షిణాదిలోని కీలకమైన కేరళం రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 200 మంది నాయకులను ఆదివారం పార్టీలో చేర్చుకుంది. కేరళంలో కొత్తగా జనసేనలో చేరిన వారిలో పలువురు ఇప్పటికే రాజకీయంగా పెద్ద పదవుల్లో ఉన్నవారుగా చెబుతున్నారు.
కేరళం రాజధాని తిరువనంతపురంలో సుమారు 200 మంది కీలక నాయకులు, కార్యకర్తలను జనసేనలో చేర్చుకున్నట్లు ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ప్రకటించారు. ఈ పరిణామంతో కేరళంలో జనసేన విస్తరణకు సమాలోచనలు చేస్తున్నామని, పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందని జనసేన పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావజాలం భాషలు, ప్రాంతాలకు అతీతమని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల వెలుపల జనసేనలో చేరికలు మొదలు అవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది.
కేరళంలోని అట్టింగల్, త్రివేండ్రం, కాలికట్, వంటి నియోజకవర్గాలకు చెందిన నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి, రాష్ట్రీయ లోక్ దళ్, హిందుస్థానీ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ నేతలు నాగబాబు సమక్షంలో జనసేనలో చేరారు. వీరికి స్థానికంగా మంచి ప్రాధాన్యం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జనసేన భావజాలానికి ఆకర్షితులై ఇతర రాష్ట్రాల నుంచి నేతలు పార్టీలో చేరుతుండటం శుభపరిణామమని ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు. కాగా, కేరళంలో జనసేన పార్టీలో ఒకేసారి 200 మంది చేరడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
సినీ హీరోగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు దక్షిణాదిలో మంచి ఇమేజ్ ఉంది. గత ఎన్నికల్లో ఏపీలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన పవన్, ప్రధానంగా కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఎన్నికల తర్వాత రాజకీయంగా పవన్ పాత్రకు చాలా ప్రాధాన్యం పెరిగింది. ప్రధానంగా ప్రధాని మోదీ కూడా పవన్ సేవలను దక్షిణాదిలో వాడుకోవాలని చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ను బీజేపీ తరఫున ప్రచారం చేయించడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఇక కర్ణాటక, కేరళం, తమిళనాడులో సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ చొరవ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయనతో రాజకీయంగా నడిచేందుకు పలు పార్టీల నుంచి నేతలు మందుకొస్తున్నారని, ప్రస్తుతం కేరళంలో చేరికలు ఇందులో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితులు గమనిస్తే భవిష్యత్తులో కూడా దక్షిణాదిలో పార్టీ విస్తరణకు అడుగులు పడొచ్చునని అంటున్నారు.
