Begin typing your search above and press return to search.

జనసేనలో వారికి ఉక్క బోతేనా ?

వేసవి కాలంలో ఉక్క బోతలు సహజం. అయితే రాజకీయాల్లో ఉన్న వారికి సీజన్ తో సంబంధం లేదు, వారికి తగిన అవకాశాలు లేకుండా ఉన్నా లేక తగిన తీరులో పరిస్థితులు లేకపోయినా ఉక్క బోత తప్పదు.

By:  Tupaki Desk   |   14 May 2025 4:20 AM
Political Heatwave: Ex-YCP Leaders in JanaSena Struggle
X

వేసవి కాలంలో ఉక్క బోతలు సహజం. అయితే రాజకీయాల్లో ఉన్న వారికి సీజన్ తో సంబంధం లేదు, వారికి తగిన అవకాశాలు లేకుండా ఉన్నా లేక తగిన తీరులో పరిస్థితులు లేకపోయినా ఉక్క బోత తప్పదు. ఆ విధంగా చూసుకుంటే కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చాక పోలోమంటూ చాలా మంది నేతలు వైసీపీ నుంచి ఆ వైపుగా పరుగులు తీశారు.

అలా వెళ్ళిన వారిలో అత్యధికులు టీడీపీలో సర్దుకుంటూ ఆ తరువాత స్థానంలో జనసేనలో చాలా మంది తమ ప్లేస్ చూసుకున్నారు ఇక జనసేనలో చేరిన వారు కండువాలు అయితే సంబరంగా కప్పుకున్నారు కానీ ఆ తరువాతనే పార్టీలో తమ పొజిషన్ ఏమిటో తెలియక ఇబ్బంది పడుతున్నారు అని టాక్ నడుస్తోంది.

జనసేనలో చేరిన వారిలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను వైసీపీ తరఫున 2024లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. అనంతరం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరినపుడు క్రిష్ణా జిల్లా జనసేన అధ్యక్ష పదవిని ఆశించారు అని చెబుతారు. ఇక అధికారంలో ఉన్న పార్టీ కదా తన హవా చెల్లుతుందని కూడా లెక్క వేసుకున్నారు.

అయితే జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన శ్రీ రాం తాతయ్య తన హవా చూపిస్తున్నారు. ఆయన టీడీపీ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేనను పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న జనసేన నేతలకే చాన్స్ లేదు, కొత్తగా చేరిన ఉదయభాను లాంటి వారికి ఉక్క బోతే అని అంటున్నారు. దాంతో ఏమి చేయాలో ఈ సీనియర్ నేతకు పాలుపోక పూర్తి మౌనం వహించారు అని అంటున్నారు.

ఇదే తీరున ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఉందని అంటున్నారు. ఆయన సైతం జనసేన నేతలు పూర్తిగా కలసిరాక టీడీపీ వారితో ఉన్న పాత రాజకీయ వైరాలతో దగ్గర కాలేక ఇబ్బంది పడుతున్నారనే అంటున్నారు. ఈ ఇద్దరు నేతలే కాదు చాలా మంది వైసీపీ నుంచి వెళ్ళి జనసేనలో చేరిన వారికి కండువాలు కప్పుకున్న రోజున ఉన్న ఉత్సాహం అయితే ఇపుడు కనిపించడం లేదు అని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి జనసేనలోకి వెళ్ళిన వారికీ మాజీ ఎమ్మెల్యేలకు సీన్ ఇలాగే ఉందిట.

ఆ మాటకు వస్తే జనసేన నాయకులుగా ఉంటూ మొదటి నుంచి పార్టీ జెండా ఎత్తి నిలిచిన వారికే టీడీపీ కూటమిలో తాము అనుకున్న విధంగా అన్నీ సాగడంలేదు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట తమ్ముళ్ళ రాజ్యమే సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో ఒక వెలుగు వెలిగిన వారు జనసేనలో చేరి పార్టీలో కీలకం కావచ్చు అధికారంలో భాగం కావచ్చు అని తలచారు. కానీ అనుకున్నది ఒక్కటి జరుగుతున్నది మరొక్కటి అన్నట్లుగా ఉందిట.

మరి ఇంకా నాలుగేళ్ళు బిగిసి ఎన్నికలకు ఉంది. మరి అప్పటి దాకా ఈ ఉక్కబోత భరిస్తారా లేక పరిస్థితులు మారుతాయని ఆశగా చూస్తారా లేక మౌనంగా ఉంటూ భవిష్యత్తు కోసం వేచి చూస్తారా అన్నదే తేలాల్సి ఉంది అంటున్నారు.