రాజ్యసభకు 'అన్నయ్య'... జనసేనలో చర్చ.. !
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి వ్యవహారం.. జనసేన వర్గాల్లో చర్చకు వస్తోంది.
By: Garuda Media | 7 Jan 2026 7:00 PM ISTజనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి వ్యవహారం.. జనసేన వర్గాల్లో చర్చకు వస్తోంది. ఒకరిద్దరు నాయకులు.. ఆయన గురించి పార్టీ కార్యాలయాల్లో చర్చించడం గమనార్హం. చిరంజీవిని రాజ్యసభకు పంపించాలన్నదే ఈ చర్చల సారాంశం. ఈ ఏడాది జూన్‌లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి జనసేనకు ఖచ్చితంగా కేటాయించే అవకాశం ఉంది.
ప్రస్తుతం లోక్‌సభలో జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. ఇద్దరు ఎంపీలు గత ఎన్నికలలో విజయం దక్కించు కున్నారు.దీంతో లోక్‌సభలో జనసేన పార్టీ వాణి వినిపిస్తోంది. కానీ, పెద్దల సభకు వచ్చే సరికి మాత్రం జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీనిపై తరచుగా చర్చలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట కూడా.. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఈ సీటును జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. అప్పట్లో వేరేవారికి కేటాయించారు.
ఇప్పుడు ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో ఒకటి జనసేనకు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. దీంతో ఈ సీటునుంచి మెగాస్టార్‌ను రాజ్యసభకు పంపించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ప్రస్తుతం నాయకుల మధ్య చర్చకు మాత్రమే పరిమితం అయింది. ఒకవేళ అధిష్టానమే ఈ దిశగా చర్చ చేస్తే.. చిరంజీవిని రాజ్యసభకు పంపించడం పెద్ద కష్టమేమీ కాదన్న చర్చ సాగుతోంది. గతంలో నాగబాబు ను రాజ్యసభకు పంపిస్తారని చర్చ తెరమీదికి వచ్చింది. కానీ, ఆయనను మండలికి పంపించారు.
ఈ నేపథ్యంలో అన్నయ్యను రాజ్యసభకు పంపిస్తే.. అన్ని స్థాయిల్లోనూ జనసేనకు ప్రాతినిధ్యం ఉంటుం దన్నది పార్టీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. కాగా.. గతంలోనూ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అప్పట్లో తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో.. కేంద్రంలో వ్యవహారాలు బాగా తెలిసిన వ్యక్తిగా కూడా చిరంజీవికి రాజ్యసభ సీటును ఇవ్వడం ద్వారా.. అన్ని విధాలా మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
