Begin typing your search above and press return to search.

కాక్రోచ్ పార్టీపై పవన్ సంచలన కామెంట్స్ !

కాక్రోచ్ పార్టీ మీద జనసేన అధినేత, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కురచ బుద్ధులతో కొంతమంది చేస్తున్న చర్యలు దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Satya P   |   15 Jun 2026 4:00 PM IST
కాక్రోచ్ పార్టీపై పవన్ సంచలన కామెంట్స్ !
X

కాక్రోచ్ పార్టీ మీద జనసేన అధినేత, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కురచ బుద్ధులతో కొంతమంది చేస్తున్న చర్యలు దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. జాతీయ వాదం జాతీయ సమగ్రత ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జనసేనకు చెందిన దక్షిణాది పార్టీల ప్రతినిధులతో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని పవన్ ఢిల్లీలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వర్తమానంలో జరుగుతున్న అనేక పరిణామాల గురించి తన భావాలను జనసేన ఆలోచనలను విప్పి చెప్పారు.

జాతీయ భావమే మూలం :

తాను ఢిల్లీ వేదికగా సమావేశం నిర్వహించడానికి మూల కారణం జాతీయ భావం అని అన్నారు. ఢిల్లీ చారిత్రాత్మకమైన నేల అన్నారు. ఎన్నో ఈ గడ్డ చూసింది అని ఆయన చెప్పారు. పవిత్రమైన ఈ నేలలో జాతీయ భావాన్ని మరో మారు గట్టిగా చాటాలన్న ఉద్దేశ్యంతోనే తాను సమావేశాన్ని ఏర్పాటు చేశాను అని పవన్ చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో అసువులు బాసారని ఆయన చెబుతూ ఆ అమర వీరులను తలచుకున్నారు. అలాగే ఈ రోజున కూడా దేశ సరిహద్దులలో ఉంటూ రక్షణ కోసం పనిచేస్తున్న వారి త్యాగాలు మరవలేనివి అని అన్నారు. అలాంటి సమయంలో దేశ సమగ్రత సమైక్యత చాలా ముఖ్యమని అన్నారు.

స్వార్ధంతోనే అలా :

దేశ సమగ్రతతో పాటు దేశానికి సంబంధించిన శ్రేయస్సు జనసేన ఎజెండాగా పవన్ స్పష్టం చేసారు. దాని కోసం జనసేన పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. కొందరు చేసే స్వార్థం పనుల కారణంగా దేశం ప్రమాదంలో పడుతోంది అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున కొన్ని పార్టీలు కేవలం తమ స్వలాభం కోసం ఆలోచిస్తూ దేశ సమగ్రతను పూర్తిగా ప్రమాదంలో పడేస్తున్నాయని పవన్ అన్నారు. ఇది మంచి విధానం కాదని పవన్ చెప్పారు. ఈ రోజున కాక్రోచ్ పార్టీలు పుట్టుకుని రావడం వెనక సంకుచితమైన భావాలే కారణం అని ఆయన అన్నారు. కేవలం తమ కోసం చూసుకుంటూ దేశాన్ని జాతికి పక్కన పెట్టడం ఏ మాత్రం ఉపేక్షించే పరిస్థితి కాదని అన్నారు.

చలి చీమల మాదిరిగా :

ఎంతతి బలవంతపు సర్పం అయిన చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అన్న తెలుగు పద్యం తనకు గుర్తుకు వస్తోందని పవన్ అన్నారు. ఈ రకమైన విభజన వాదాలు దేశానికి ఏ మాత్రం మేలు చేయవని పవన్ స్పష్టం చేశారు. ఎవరికి వారుగా తక్కువ అంచనా వేసుకుంటామని కానీ ప్రతీ వ్యక్తి సమాజంలో మంచి మార్పుని తీసుకుని రావచ్చు అని పవన్ చెప్పారు. మంచి వైపుగా ఏ మార్పు అయినా సాగాలని పవన్ అన్నారు. తాను పార్టీ స్థాపించినపుడు ఆ విధంగానే ఆలోచన చేశాను అని ఆయన చెప్పారు.

తెలంగాణాను వ్యతిరేకించలేదు :

ఇదిలా ఉంటే జనసేన ఏనాడూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని పవన్ స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తీరుతోనే అసంతృప్తి ఉందని చెప్పారు. ఇక కాంగ్రెస్ తీరు ఇప్పటికి కూడా మారలేదని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు. ఢిల్లీ మెడలు వంచుతామని చాలామంది దక్షిణాది నేతలు మాట్లాడుతున్నారని, వారంతా తమ తమ రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారి నోళ్లు ఢిల్లీ వచ్చాక పెగలడం లేదని పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.

జనసేన విధానం అదే :

కాల మాన పరిథితులు ఎలా ఉన్నప్పటికీ జనసేన తన విధానంలో ఏ మాత్రం మార్పు చేసుకోలేదని పవన్ చెప్పారు. జనసేన ఏడు ప్రాథమిక సూత్రాలతో 12 ఏళ్ళ క్రితం ఏర్పాటు అయిందని దానిని దానిని కొనసాగిస్తూనే ఉందని పవన్ చెప్పారు. జనసేనకు అన్నింటి కంటే కూడా దేశ సమగ్రత సమైక్యత జాతీయ వాదం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కాక్రోచ్ పార్టీ పేరుతో దేశంలో నిర్వహిస్తున్న సభలు సమావేశాల మీద పవన్ తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు.