Begin typing your search above and press return to search.

జనసైనికులు కూడా త్యాగమూర్తులే కదా...!

ఎంతో అని ఊహించుకున్న పార్టీ సీఎం గా పవన్ ని చూడాలనుకున్న సైన్యం ఇలా అతి తక్కువ నంబర్ కళ్ల ముందు కనబడేసరికి డంగ్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:30 AM IST
జనసైనికులు కూడా త్యాగమూర్తులే కదా...!
X

జనసేనకు మరీ ఇంత తక్కువ సీట్లు ఇస్తారా అని అలగడం ఆగ్రహించడం జనసైనికులు చేస్తున్నారు. అందులో అమితమైన ప్రేమ ఉంది. అభిమానం ఉంది. ఎంతో అని ఊహించుకున్న పార్టీ సీఎం గా పవన్ ని చూడాలనుకున్న సైన్యం ఇలా అతి తక్కువ నంబర్ కళ్ల ముందు కనబడేసరికి డంగ్ అయిపోయింది. దాని నుంచి నిజాయతీగా వచ్చిన ఆవేశమే నిరసనని మారింది.

అయితే అంతా పవన్ త్యాగమూర్తి అని చెబుతున్నారు. ఆయన అవినీతి మరక అంటని వారు అని అంటున్నారు. ఇందులో నిజం ఉండొచ్చు. పవన్ ఏ పదవీ తీసుకోకుండా పదేళ్ళుగా పార్టీ కోసం తన సొంత డబ్బులను వెచ్చింది నడిపించవచ్చు. కానీ అదే విధంగా తమ ఏరియాలలో సైనికులు కూడా తమ శక్తి మేర డబ్బులు పెట్టి పార్టీని నడిపించిన సంగతిని పవన్ కి వత్తాసుగా వీడియో బైట్లు రిలీజ్ చేస్తున్న వారు ఎందుకు గమనించరు అన్న మాట వస్తోంది.

డబ్బు ఎవరికీ ఊరికే రాదు అన్నది ఒక ప్రముఖ జ్యూయలరీ యజమాని ఫ్యామస్ డైలాగ్. అలాగే సైనికుడు అయినా సేనాని అయినా డబ్బు ఊరకే రాదు. అంతే కాదు దాని కంటే ఎంతో విలువ అయిన టైం కూడా ఊరికే రాదు. పదేళ్ళు కష్టాలు పడిన క్యాడర్ ఈసారి పొత్తులో అయినా వికసించాలని కోరుకోవడంతో తప్పు లేదు కదా.

ముద్దు వచ్చినపుడే చంకను ఎక్కాలన్నది ఒక ముతక సామెత.అలా రాజకీయంగా అవకాశం వచ్చినపుడే అందలం ఎక్కాలన్నది లౌక్యులు చెప్పే మాట. అది వృద్ధ నేతలు అయినా రాజకీయంగా వర్ధమానులు అయినా చెప్పేది అదే. ఏపీలో ఉన్న రాజకీయాన్ని పవన్ సరిగ్గా ఉపయోగించుకోలేదు అన్నదే జనసైనికుల ఆవేదన అయి ఉండవచ్చు. బొత్తిగా ఇరవై నాలుగు ఏమిటి మరో ఇరవై సీట్లు ఇవ్వమని డబాయితే పోయేది ఏముంది అన్నదే వారి వాదన, వేదన.

ఆయా సీట్లలో తమ వారిని దించుకుని ద్విగుణీకృతమైన బలంతో అసెంబ్లీలోకి అడుగుపెడితే అపుడు రాజకీయాన్ని 2024లోనే శాసించవచ్చు కదా అనేది కూడా వారి మాటగా ఉంది. ఎపుడో మరో పదేళ్లకు రాజకీయాలను శాసిద్దామన్న పధకాలు మంచివే. ఇప్పటికే పదేళ్ళ పుణ్య కాలం పూర్తి అయింది కదా మరో పదేళ్ళు అంటే ఏమి జరుగుతుందో అన్న ధర్మ సందేహాలు కూడా వారికి ఉంటాయి కదా.

ఇక డబ్బులు సమయం ఖర్చు చేసి ఆయా చోట్ల తామే అభ్యర్ధులమని భావించి రాజకీయం చేసిన వారికి సీటు లేదు ఫేట్ ఇక ఇంతే అని అనుకుంటే బాధ వేయదా. వారికి ఊరడింపు మాటలు చెప్పేందుకు ఎందరైనా వస్తారు కానీ దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న క్యాడర్ బాధ మాత్రం ఎవరూ తీర్చలేనిదీ పూడ్చలేనిదీ కదా.

ఇంకా ఏరు దాటలేదు, అపుడే ఇంత చిన్న నంబర్ తో పొత్తు కధను రక్తి కట్టించిన టీడీపీ రేపు అధికారంలోకి వస్తే ఇంకేమైనా చూస్తుందా అన్న భయం ఉండడంలో తప్పేముంది. టీడీపీని సమర్ధించమని జనసేన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. కానీ జనసేనను సమర్ధించమని టీడీపీ వైపు నుంచి ఇలా ఏ శ్రేయోభిలాషి అయినా వీడియో బైట్స్ వదులుతున్నారా అన్న సైనికుల మాటకు జవాబు చెప్పేది ఎవరు.

అందువల్ల గట్టు మీద ఉండి ఎవరైనా ఎన్ని అయినా చెప్పవచ్చు. ఈ రోజు జనసేన నేతలలో నిండా నిరాశ కమ్ముకుంది. దానిని జనసేన వైపు నుంచి ఓదారిస్తే తీరదు, టీడీపీ నుంచి వారికి గట్టి భరోసా కావాలి. ఈ రోజు ఇలా జరిగినా అధికారంలోకి వచ్చాక లోకల్ బాడీ ఎన్నికల నుంచి అన్నీ మీకే ప్రాధాన్యత ఇస్తాం, నామినేటెడ్ పదవుల నుంచి అన్నింటా మీకు అగ్ర తాంబూలం ఇస్తామని టీడీపీ పెద్దలు నచ్చ చెబితే ఎన్నికల ముందే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే అపుడు వారి ఆవేదన ఎంతో కొంత చల్లారుతుందేమో.

అంతే తప్ప మనమే సర్దుకోవాలి అంటే వారు ఆగుతారా. ధర్మాగ్రహానికి అర్ధాలు వెతకడం ఎంత తప్పో అపార్ధం చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. జనసైనికుల వేదనకు మందు కూటమి పెద్దల వద్దనే ఉంది. ముఖ్యంగా టీడీపీ పెద్దల చేతిలో ఉంది. దానికి సరైన టైం లో సక్రమంగా ప్రయోగిస్తే ఈ రచ్చ ఆగుతుంది. చిచ్చు సమసిపోతుంది. ఓట్ల బదిలీ సజావుగా సాగుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అన్నది జనాంతికమైన మాట. ఇదే జనసైనికుల మాట కూడా కావచ్చు అంటున్నారు.