Begin typing your search above and press return to search.

అబ్బాయి అసెంబ్లీకి.. ఆయనేమో పార్లమెంటుకు.. రిటైరయ్యేదేలే

దీంతోనే ఆయన రాజకీయంగా వెనుకబడ్డారు. కాగా, ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 12:58 PM IST
అబ్బాయి అసెంబ్లీకి.. ఆయనేమో పార్లమెంటుకు.. రిటైరయ్యేదేలే
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆశావహ అభ్యర్థులంతా సిద్ధమైపోయారు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే దాదాపు టికెట్లు ప్రకటించింది. నేడో రోపో కాంగ్రెస్ జాబితా కూడా విడుదల కానుందని చెబుతున్నారు. అయితే, అనేక వడపోతల తర్వాత ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈసారి అధికారంలోకి రావాలని.. సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా, ఇప్పటికే పలుసార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన సీనియర్లు కొందరు తప్పుకొనే యోచనలో ఉన్నారు. ఇలాంటివారిలో నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్యన హోం మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన జానారెడ్డి 2004కు ముందు పలుసార్లు చలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

1983లో ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జానారెడ్డి ఆ తర్వాత ఎన్టీఆర్ తోనే విభేదించి సొంతంగా పార్టీ స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. చలకుర్తి నుంచి నాలుగుసార్లు, సాగర్ నుంచి రెండు సార్ల మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం 77 ఏళ్ల వయసున్న జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటారనే అందరూ భావించారు.

కుమారుడికి సీటు?

సాగర్ లో 2018 సాధారణ ఎన్నికలతో పాటు నుంచి 2022లో జరిగిన ఉప ఎన్నికలో జానారెడ్డి పరాజయం పాలయ్యారు. దీంతోనే ఆయన రాజకీయంగా వెనుకబడ్డారు. కాగా, ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో ముందున్నారు. ఆయనకే టికెట్ ఖరారవుతుందనే ప్రచారం జరుగుతోంది.

లోక్ సభకు జానారెడ్డి

తెలంగాణలో అత్యంత సీనియర్ అయిన జానారెడ్డి వైఎస్ మరణం అనంతరం ఒక దశలో సీఎం అభ్యర్థిగానూ ప్రాచరంలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అది నెరవేరకున్నా.. రాష్ట్ర విభజన అనంతరం పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో అవకాశం లేకపోయింది. ఇక త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలో నిలవరనే అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా లోక్ సభకు పోటీ చేయాలనే ఆసక్తిని వెల్లడించారు.

కోమటిరెడ్డి, ఉత్తమ్ కు ఎసరు?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు సీట్లకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు. వారిద్దరూ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయం. అయితే, అందులో ఓటమి పాలైతే లోక్ సభ బరిలో నిలుస్తారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారో చూడాలి. ఒకవేళ ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఇబ్బంది లేదు. అదే ఇద్దరూ ఓడిపోయి లోక్ సభ బరిలో నిలుస్తానంటేం జానాకు టికెట్ కష్టమే. ఎందుకంటే వారిద్దరూ సిటింగ్ ఎంపీలు కావడమే కారణం.