Begin typing your search above and press return to search.

పల్లాకు టికెట్.. మరి ముత్తిరెడ్డికి?

జనగామలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి ఉన్నారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.

By:  Tupaki Desk   |   24 Sep 2023 3:30 AM GMT
పల్లాకు టికెట్.. మరి ముత్తిరెడ్డికి?
X

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం. ఆ దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టికెట్ దక్కని కొంతమంది నేతలు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిగతా నాలుగు స్థానాల్లో టికెట్ల కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్, మంత్రి కేటీఆర్ ఒక్కొక్కరిని బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా టికెట్ ప్రకటించిన జనగామ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన కేటీఆర్.. ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య విభేదాలను పరిష్కరించారు. దీంతో పల్లా విజయం కోసం పనిచేస్తానని ముత్తిరెడ్డి చెప్పినట్లు తెలిసింది.

జనగామలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి ఉన్నారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న ముత్తిరెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆవేదనతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జనగామ టికెట్ ఎవరికీ అనే సందిగ్ధత నెలకొంది. కానీ ఇప్పుడు పల్లాతో పాటు ముత్తిరెడ్డిని పిలిపించుకుని కేటీఆర్ మాట్లాడారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతుండటానికి కారణాలను కేటీఆర్ వివరించినట్లు తెలిసిందే. టికెట్ ఇవ్వకపోయినా భవిష్యత్లో సముచిత స్థానం కల్పిస్తామని ముత్తిరెడ్డికి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

మొత్తానికి జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి దక్కడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో స్థానాన్ని త్యాగం చేస్తున్న ముత్తిరెడ్డికి కేసీఆర్ ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్కు టికెట్ దక్కని సంగతి తెలిసిందే. కానీ ఆయన్ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా క్యాబినేట్ హోదా పదవితో కేసీఆర్ బుజ్జగించారు. మరి ఇప్పుడు ముత్తిరెడ్డికి కూడా అలాంటి పదవే ఇస్తారా? అన్నది చూడాలి. లేదంటే రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఉన్న పల్లా స్థానంలోకి ముత్తిరెడ్డిని తీసుకుంటారా? మరోవైపు రైతు బంధు సమితి అధ్యక్షుడిగా తాటికొండ రాజయ్యను నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. స్టేషన్ ఘన్ పూర్లో కడియం శ్రీహరి కోసం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య వదులుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ముత్తిరెడ్డిని ఎమ్మెల్సీగా చేసి.. అనంతరం మంత్రిని చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.