Begin typing your search above and press return to search.

ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి వ‌ర్సెస్ ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి

ఇక్క‌డ ప‌రిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి వ‌ర్సెస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డిగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Aug 2023 11:30 PM GMT
ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి వ‌ర్సెస్ ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి
X

జ‌న‌గామ‌లో మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయం వేడెక్కింది. ఇక్క‌డ ప‌రిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి వ‌ర్సెస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డిగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఎమ్మెల్యే టికెట్‌పై గురి పెట్టార‌ని స‌మాచారం. తాజాగా ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి మ‌ద్ద‌తుగా ఆయ‌న అనుచ‌రులు. పార్టీలోని జ‌న‌గామ జిల్లా ముఖ్య నేతలు హైద‌రాబాద్‌లో స‌మావేశం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సమావేశం గురించి తెలుసుకున్న ముత్తిరెడ్డి నేరుగా అక్క‌డి వెళ్ల‌డం మ‌రింత హాట్ టాపిక్‌గా మారింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రైతుబంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న పల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని అధిష్ఠానాన్ని కోరేందుకు జ‌న‌గామ‌, చేర్యాల‌కు చెందిన బీఆర్ఎస్ కీల‌క నేత‌లు హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు, జ‌న‌గామ జడ్పీ ఛైర్మ‌న్ కూడా అయిన పాగాల సంప‌త్‌రెడ్డి, జ‌న‌గామ మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ జ‌మున‌, రైతుబంధు స‌మితి జిల్లా అధ్య‌క్షుడు ఇర్రి ర‌మ‌ణారెడ్డి త‌దిత‌ర 20 మంది నాయ‌కులు హైదరాబాద్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం గురించి తెలిసిన ముత్తిరెడ్డి అక్క‌డికి వెళ్లారు. కానీ అధిష్ఠానం ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌ని, త‌మ‌పై ఒత్తిడి తేవొద్ద‌ని ముత్తిరెడ్డికి ఆ నాయ‌కులు చెప్పిన‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే జ‌న‌గామ నుంచి బీఆర్ఎస్ టికెట్‌ను మ‌రో ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు తెర‌పైకి ప‌ల్లా పేరు వ‌చ్చింది. దీంతో టికెట్ పోరు ముక్కోణంగా మారింది. ఈ గొడ‌వ‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను అధిష్ఠానం ఓ కీల‌క మంత్రికి అప్ప‌జెప్పిన‌ట్లు తెలిసింది. అయితే ఆ మంత్రి సూచ‌న‌తోనే పల్లాకు మ‌ద్దతుగా జిల్లా నాయ‌కులు హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌న‌గామ టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.