Begin typing your search above and press return to search.

టీడీపీ వైసీపీ టాప్...జనసేన సీన్ రివర్స్ !

ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలూ అధికారం పంచుకున్నవే. టీడీపీ అయితే పలు మార్లు అధికారం అందుకుంది.

By:  Satya P   |   13 Aug 2026 12:01 AM IST
టీడీపీ వైసీపీ టాప్...జనసేన సీన్ రివర్స్ !
X

ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలూ అధికారం పంచుకున్నవే. టీడీపీ అయితే పలు మార్లు అధికారం అందుకుంది. వైసీపీ ఒకసారి అయిదేళ్ల పాలన పూర్తి చేసింది. పొత్తులో భాగంగా జనసేన 2024 నుంచి అధికారంలో భాగస్వామ్యం అయింది. అయితే టీడీపీ వైసీపీల మధ్య పోటా పోటీ రాజకీయం సాగుతోంది. ఈ రెండు పార్టీలు అధికారాన్ని అందుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. ఈ పార్టీలు గ్రౌండ్ లెవెల్ వరకూ పాతుకుని పోయాయి. రాష్ట్రంలో రాజకీయం కూడా రెండుగా చీలిపోవడమే కాదు ఢీ అంటే ఢీ రాజకీయం ఈ రెండు పార్టీల మధ్య ఉంది. ఇక జనసేన తీసుకుంటే 2014లో పుట్టినా 2019 దాకా ఆ పార్టీ పోటీకి దిగలేదు, 2019లో పోటీ చేసినా ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఇక 2024లో అధికారం అందుకున్న జనసేన సంస్థాగతంగా ఇంకా బలపడలేదని అంటున్నారు.

బూత్ లెవెల్ దాకా ఆ రెండు పార్టీలు :

ఏపీ రాజకీయాల్లో సంస్థాగతంగా టీడీపీ వైసీపీ అత్యంత పటిష్టంగా ఉన్నాయని అంటున్నారు. బూత్ లెవెల్ దాకా ఈ పార్టీల కమిటీలు ఉన్నాయి. తెలుగు దేశం పార్టీకి 46,397 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటే వైసీపీకి 45, 973 మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలతో పోలిస్తే జనసేనకు కేవలం 8,988 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. సంస్థాగతంగా జనసేన బలహీనంగా ఉందని అంటున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే వారే ఏ పార్టీకి అయిన వెన్నెముకగా చెబుతారు. ప్రస్తుతం జరిగిన సర్ ప్రక్రియలో తమ పార్టీ ఓట్లను కాపాడుకోవడం దగ్గర నుంచి పోలింగ్ రోజున మొత్తం వారే అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు అన్నది వాస్తవం. బీఎల్వోలు పార్టీకి బలం మాత్రమే కాదు వారే సర్వస్వం అలాంటి బీఎల్వో వ్యవస్థ జనసేనలో వీక్ గా ఉందని అంటున్నారు.

జనసేన పరిమితంగానే :

జనసేన ఏపీ రాజకీయాల్లో అయితే పరిమితంగానే పాత్ర పోషిస్తోంది. ఆ పార్టీకి పొత్తులో 21 సీట్లు దక్కాయి. అయితే సమీప భవిష్యత్తులో జనసేన బలంగా ఎదగాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో కనీసంగా 50 నుంచి 75 దాకా సీట్లు తీసుకోవాలని కూడా పార్టీ మీద ఒత్తిడి ఉంది. అంతే కాదు పొత్తు కాకుండా సొంతంగా పోటీ చేసే స్థాయికి కూడా జనసేన ఎదగాల్సి ఉంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన పోటీ చేసే పరిస్థితి రావాలీ అంటే అన్ని చోట్లా టీడీపీ వైసీపీ మాదిరిగా సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేసుకోవాల్సి ఉందని అంటున్నారు.

అదే యూనిట్ గా :

ఒక్కో బూత్ లో కనీసంగా వేయి నుంచి పన్నెండు వందల దాకా ఓట్లు ఉంటాయి. బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవడం ద్వారానే జనసేన పటిష్టం అవుతుందని సూచిస్తున్నారు. బూత్ లెవెల్ లో గట్టిగా పార్టీ యంత్రాంగం ఉంటే కనుక ఏ ఎన్నికల్లో అయినా ఓటింగ్ బాగా జరిగేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు పోటీగా ధీటుగా బూత్ లెవెల్ లో జనసేన పార్టీ క్యాడర్ కూడా తిరగాల్సి ఉంది. ఓటర్లను ఇంటింటికీ వెళ్ళి కలిసే ప్రయత్నం చేయడం తమ పార్టీ వైపుగా వారిని ఆకట్టుకోవడం వంటివి చేయాలీ అంటే జనసేన ఇంకా చాలా చేయాల్సి ఉందని అంటున్నారు.

పై స్థాయిలో కాదు :

ఏ పార్టీ అయినా పై స్థాయిలో కాదు గ్రౌండ్ లెవెల్ లో పటిష్టత చూసుకోవాలి. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడినా 40 శాతం ఓట్లు వచ్చాయి అంటే బూత్ లెవెల్ దాకా ఆ పార్టీ విస్తరించుకుంది. అలాగే టీడీపీకి 2019 ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇలా రెండు పార్టీలు తమ ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకోగలిగారు. జనసేన కూడా బూత్ లెవెల్ లో కమిటీల నిర్మాణం కోసం ఫోకస్ పెడితేనే తప్ప బలం చేకూరదని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లకు పోటీ చేసినా గెలవాలీ అంటే సంస్థాగత నిర్మాణమే ముఖ్యమని అంటున్నారు. జనసేన చేతిలో ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి బలపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.